calender_icon.png 23 September, 2024 | 4:58 AM

భారత్ అన్‌స్టాపబుల్

23-09-2024 02:29:29 AM

  1. మనను ఏ శక్తీ ఆపలేదు
  2. నేడు ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రసంగం
  3. అవకాశాల కోసం ఎదురుచూపులు పోయాయి
  4. మనమే అవకాశాలు సృష్టిస్తున్నాం
  5. భారత్ ఇప్పుడు అవకాశాలకు కేంద్రం
  6. న్యూయార్క్‌లో ప్రవాసులతో సమావేశంలో ప్రధాని మోదీ
  7. క్వాడ్ సదస్సులో సభ్యదేశాధినేతలతో చర్చలు
  8. ఏఐ అంటే అమెరికా-ఇండియా.. ఆకాంక్షల భారత్
  9. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం

న్యూయార్క్, సెప్టెంబర్ 22: భారత్ అన్ని రంగాల్లో అన్‌స్టాపబుల్‌గా మారుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. అవకాశాల కోసం ఎదురుచూసే రోజులు పోయి మనమే అవకాశాలు సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని నసావు కొలీజి యంలో నిర్వహించిన యూఎస్ అండ్ మోదీ టుగెదర్ కార్యక్రమంలో భారత సమాజాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏఐ అంటే అమెరికా అని, ఆకాంక్షల భారత్ అని అభివర్ణించారు. విదేశాల్లో జీవిస్తున్నా ప్రతి క్షణం భారత్‌కు బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రవాస భారతీయులను మోదీ ప్రశంసించారు.

అమెరికాలోని భారతీయుల నైపుణ్యా లు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. భారత్‌లో ఎన్నో భాషలు, మతాలు ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. భారత్‌లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డిజిటల్ విప్లవం మొదలైందని, 5జీతో పాటు యూపీఐ సేవలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటు న్నాయని తెలిపారు. 

బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు

నాలుగో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. డెలావేర్‌లోని బైడెన్ నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, అమెరి ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపై ఇరు నేతలు చర్చించారు. భేటీ అనంతరం చర్చలు ఫలప్రదమైనట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన నివాసంలో ఆతిథ్యమిచ్చినందుకు జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఎంక్యూ9బీ ప్రెడేటర్ డ్రోన్‌తోపాటు కోల్‌కతాలో సెమీకండక్టర్ ప్లాంట్ గురించి ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మోదీ, బైడెన్ చర్చల్లో డ్రోన్ల కొనుగోలుతో పాటు సంయుక్త సైనిక విన్యాసాలపై అవగాహనకు వచ్చారు. అమెరికా నుంచి భారత్ 31 ఎంక్యూ ప్రెడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంపై బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో 15 నేవీకి, 8 వాయుసేన, మరో 8 ఆర్మీకి ఉపయోగపడే విధంగా ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన 3.99 బిలియన్ డాలర్ల డీల్‌కు ఫిబ్రవరిలోనే అమెరికా ఆమోదం తెలిపింది. తాజా భేటీతో సైన్యంలో వీటి చేరికపై స్పష్టత వచ్చింది. జెట్ ఇంజిన్లు, మందుగుండు సామగ్రి, గ్రౌండ్ మొబిలిటీ వ్యవస్థల అభివృద్ధిపైనా చర్చలు జరిగాయి. దీని పురోగతి బాగుందని ఇద్దరు నేతలు ప్రశంసించారని వైట్‌హౌస్ తెలిపింది. కోల్‌కతాలో కొత్త సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటుపై ఇరునేతలు చర్చించారు. 

ఐరాసలో శాశ్వత సభ్యత్వంపై.. 

మోదీ, బైడెన్ చర్చల సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలపైనా ప్రస్తావన వచ్చింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం పొందేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ స్పష్టం చేశారు. క్వాడ్ సదస్సులో భాగంగా క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ దేశాలకు 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించి క్యాన్సర్‌తో పోరాటానికి సాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అందుకే మూన్‌షాట్ చొరవ కింద 75 లక్షల డాలర్ల విలువైన నమూనా కిట్లు, డిటెక్షన్ కిట్ల అందిస్తామని తెలిపారు. 

మోదీపై బైడెన్ భరోసా

డెలావేర్‌లో జరిగిన క్వాడ్ సదస్సులో బైడెన్ కూటమి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరిగినా తర్వాత కూటమి నిలబడుతుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. మళ్లీ ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి నవంబర్ తర్వాత కూడా కూటమి మనుగడ సాగిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయడంలేదు. అలాగే క్వాడ్‌లో భాగమైన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ ఉంటే కూటమి కొనసాగుతుందనే ఉద్దేశంతో బైడెన్ ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా, 2025లో క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.   

చైనా అందరినీ పరీక్షిస్తోంది

దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ సార్వభౌమాధికారంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ సొంతూరు విల్మింగ్‌టన్‌లో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఆర్థిక, సాంకేతిక సమస్యలతో పాటు అనేక రంగాలలో  ఈ ప్రాంతంలో చైనా మనందరినీ పరీక్షిస్తోందని పేర్కొన్నారు. చైనాతో పోటీకి తీవ్రమైన దౌత్యం అవసరమని నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. చైనా సొంత ప్రయోజనాలు కోసం జిన్‌పింగ్ ఎంతకైనా తెగిస్తారని అనిపిస్తోందని చెప్పారు. 

మళ్లీ తడబడ్డ బైడెన్ 

ఇండో-పసిఫిక్ కూటమికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో క్వాడ్ నాయకులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీని పరిచయం చేసే విషయంలో బైడెన్ తడబడ్డారు. తన ప్రసంగం తర్వాత అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఇప్పుడు ఎవరిని పరిచయం చేస్తున్నాను? అంటూ కొద్దిసేపు ఆగిపోయారు. నెక్స్ ఎవరు? అంటూ తన సిబ్బందిని అడిగారు. ఇంతలో పరిస్థితిని అర్థం చేసుకున్న మోదీ తన స్థానం నుంచి లేచి బైడెన్ వద్దకు వచ్చారు. 81 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకసార్లు ఇలాగే తడబడ్డారు.