calender_icon.png 28 September, 2024 | 8:54 PM

మూడో పెద్ద రియల్టీ మార్కెట్ భారత్

20-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ప్రపంచంలో మూడో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించిందని రియల్లీ కన్సల్టెంట్ కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి  రియల్టీ పెట్టుబడులను ఆకర్షించడంలో చైనా, సింగపూర్‌ల తర్వాత భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఇండియాలోకి విదేశీ ఇన్వెస్టర్లు చేసే రియల్టీ పెట్టుబడుల్లో అధికభాగం (70 శాతం) ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ రంగాల్లోకి వస్తున్నాయని పేర్కొంది. లాజిస్టిక్ కంపెనీల ప్రత్యేకించి ఈ కామర్స్ విభాగం  నుంచి పెరుగుతున్న డిమాండ్, ఇండస్ట్రియల్ కారిడార్స్ విస్తరణ కోసం తయారీ కంపెనీల డిమాండ్‌తో ఈ రంగాల్లోకి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని తెలిపింది.

2024 ద్వితీయ త్రైమాసికంలో అంతర్జాతీయంగా రియల్టీలోకి తరలి వస్తున్న నిధుల్లో 77 శాతం చైనాల్లోకి వెళ్లాయని, సింగపూర్ 4.1 శాతం పెట్టుబడుల్ని ఆకర్షించగా, ఇండి యా 3.1 శాతం గ్లోబల్ పెట్టుబడుల్ని సంపాదించిందని కొలియర్స్ వివరించింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో సింగపూర్‌లోకి 1.93 బిలియన్ డాలర్లు, ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలోకి 1.49 బిలియన్ డాలర్ల  విదేశీ పెట్టుబడులు వచ్చాయని కొలియర్స్ తెలిపింది. ఈ ఏడాది ప్రధమార్థంలో 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని భారత్ రియల్టీ రంగం ఆకర్షించినట్టు వెల్లడించింది.