calender_icon.png 20 October, 2024 | 9:24 AM

భారత్‌కు ఇం‘ధన’మే

18-10-2024 02:03:44 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రపంచ ఆర్థిక శక్తుల్లో భారత్‌కు స్థానమే లేదు. పశ్చిమదేశాలు భారత్‌ను గరీబు దేశమని, భారతీయులను పాములాడించే ప్రజలు అని గేలి చేసేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు చుట్టుపక్కల దేశాలేం ఖర్మ అహంకారంతో విర్రవీగే అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలే భారత్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకొనేందుకు అర్రులు చాస్తున్నాయి. ఒకనాడు పెట్టుబడులు పెట్టాలని కోరితే ముఖం చిట్లించిన పశ్చిమదేశాల కంపెనీలే నేడు భారతీయ మార్కెట్‌లో వాటా దక్కించుకొనేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నా యి.

భారత దేశపు ఈ వృద్ధి పరుగులు ఇప్పట్లో ఆగేవి కావని ప్రపంచం మొత్తానికి అర్థమయ్యింది. అంతేకాదు.. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక వృద్ధికి ‘ఇంధనమే’ జీవాధారమని తాజాగా ఓ నివేదిక తెలిపింది. 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక ఇంధన డిమాండ్ ఉండేది భారత్‌లో మాత్రమేనని వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్ 2024 వెల్లడించింది. ‘స్టేటెడ్ పాలసీస్ సినారియో’ (స్టెప్స్) పేరుతో విడుదలైన నివేదికలోని కీలక అంశాలు కొన్ని..

v 2035 నాటికి ప్రపంచంలో అత్యధిక ఇంధన డిమాండ్‌గల దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంటుంది. ఇందుకు కారణం మనదేశంలో నిర్మాణ, పారిశ్రామిక, సేవల రంగాలన్నీ వేగంగా పురోగమించటమే.

v 2030 నాటికి భారత ఇంధన రంగానికి బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తు మరో 60 గిగావాట్లు తోడవుతుంది.

v 2035 నాటికి మనదేశంలో రోజుకు కనీ సం 12వేల కొత్త కార్లు రోడ్లపైకి వస్తాయి.

v 2035 నాటికి దేశంలో ఏటా భవన నిర్మాణ ప్రాంతం కొత్తగా 100 కోట్ల చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ఇది ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశం మొత్తంలో ఉన్న బిల్ట్ స్పేస్‌కు సమానం. అంటే దక్షిణాఫ్రికా మొత్తంలో ఉన్నంత విస్తీర్ణంలో భవన నిర్మాణాలు భారత్‌లో ప్రతి ఏటా జరుగుతాయని అర్థం.

v ప్రస్తుత స్థాయితో పోల్చుకొంటే 2035 నాటికి భారత్‌లో ఉక్కు ఉత్పత్తి 70 శాతం పెరుగుతుంది. సిమెంటు ఉత్పత్తి 55 శాతం పెరుగుతుంది. 

v ఇండ్లు, కార్యాలయాల్లో చల్లదనం కోసం వాడే ఎయిర్ కండిషనర్ల సంఖ్య 2035 నాటికి ఇప్పుడున్నవాటితో పోల్చితే నాలుగున్నర రెట్లు పెరుగుతాయి. మనదేశంలోని ఏసీలకే మెక్సికో దేశం ఒక సంవత్సరంలో అన్ని అవసరాలకు వాడేంత కరెంటు అవసరమవు తుంది. 

v 2035 నాటికి మన దేశంలో ఇంధన డిమాండ్ 35 శాతం పెరుగుతుంది. ఉత్పత్తి సామర్థ్యం 1400 గిగావాట్లకు పెరిగే అవకాశం ఉన్నది. 

v అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం కాలుష్య ఉద్ఘారాల విడుదలను 2070 నాటికి భారత్ సున్నా స్థాయికి తగ్గించాల్సి ఉన్నది. కానీ, ఇంధన ఉత్పత్తిలో మరికొన్ని దశాబ్దాలపాటు బొగ్గే కీలక పాత్ర పోషిస్తుందని ఐఈఏ తెలిపింది. మొత్తం విద్యుత్తు ఉత్పత్తి పెరుగుదలలో థర్మన్ విద్యుత్తు పెరుగుదల 15 శాతం ఉంటుందని అంచనా వేశారు. 

v ఉక్కు, సిమెంటు మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమల కరెంటు అవసరాల్లో 2023 నాటికి థర్మల్ విద్యుత్తు 40 శాతం వినియోగిస్తున్నారు. 2035 నాటికి ఇది 50 శాతానికి పెరిగే అవకాశం ఉన్నది. 

v థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి 2023 ఆర్థిక సంవత్సరంలో 75 శాతం పెరిగింది. 2019 ఇది 71 శాతం వృద్ధి సాధించింది.

v అమెరికా, యూరప్‌లో విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు వినియోగం 2023లో తగ్గగా, భారత్‌లో 8 శాతం, చైనాలో 5 శాతం పెరిగింది అని నివేదికల తెలిపారు.