calender_icon.png 8 November, 2024 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ఘోర దౌత్య వైఫల్యం

07-08-2024 02:57:07 AM

విదేశాంగ విధానంలో మాయని మచ్చ

బంగ్లా పరిణామాలను పసిగట్టడంలో విఫలం

నిఘా సంస్థలూ కనిపెట్టలేకపోయిన కుట్ర

హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ అనాసక్తి

ఆమె ఇండియాలోనే ఉండిపోయే అవకాశం

న్యూఢిల్లీ, ఆగస్టు 6: చుట్టూ మనమే ఉన్నాం. మధ్యలో ఉన్న ఓ చిన్న దేశంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే తెలుసుకోగలిగే సామర్థ్యమూ మనకు ఉన్నది. విదేశాంగ విధానంలో అపార అనుభవం ఉన్నదని ప్రధాని మోదీ ఏరి కోరి తెచ్చుకొన్న విదేశాంగమంత్రీ ఉన్నాడు. అయినా మన పక్కనే ఓ భారీ కుట్ర జరుగుతున్నా వీరంతా గుర్తించలేకపోయారు.

పరిస్థితులు చేయిదాటిపోయేదాకా స్పందించకుండా ఉండిపోయారు. అంతా అయిపోయాక ఇప్పుడు కారణాలు వెదికే పనిలో పడ్డారు. బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ముందే పసిగట్టి కౌంటర్ యాక్షన్ చేపట్టడంలో భారత నిఘా వర్గాలు దారుణంగా విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిత్యం దేశదేశాలు తిరిగే విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అయితే ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ప్రకటించి తన వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు. స్వదేశం నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వటంలోనూ మోదీ సర్కారు తొందరడిందని, ముందుముందు ఈ అంశం దేశానికి తలనొప్పులు తెస్తుందని మేధావులు అంటున్నారు. 

ముందుముందు తలనొప్పులే

బంగ్లాదేశ్ నుంచి అత్యవసరంగా పారిపోయి ఇండియా వచ్చిన షేక్ హసీనాకు భారత్ అన్నిరకాలుగా సాయం చేసింది. ఆమె విమానానికి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలతో రక్షణ కల్పించి మరీ తీసుకొచ్చింది. ఆమె ఇటునుంచి బ్రిటన్ వెళ్తారని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే ఆమె బ్రిటన్‌లో రాజకీయ పునరావాసం కోరినట్టు సమాచారం.

అయితే, బ్రిటన్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. బంగ్లాదేశ్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని మాత్రమే డిమాండ్ చేసింది. ఆమెకు ఆశ్రయం ఇవ్వటం బ్రిటన్‌కు ఇష్టం లేదని తెలుస్తున్నది. ఒకవేళ ఆమెకు బ్రిటన్ ఆశ్రయం ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి? ఆమె మరో దేశాన్ని వెదుక్కొనేవరకు ఇండియాలోనే ఉంటారు.

మరోవైపు బంగ్లాదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం హసీనాపై ఏదైనా విచారణకు ఆదేశించి ఆమెను అప్పగించాలని కోరితే భారత ప్రభుత్వ పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం మోదీ ప్రభుత్వ విదేశాంగ విధాన ఘోర వైఫల్యాన్ని సూచిస్తున్నదని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు మండిపడుతున్నారు.