calender_icon.png 22 October, 2024 | 11:00 AM

గ్లోబల్ ఎకానమీలో భారత్ వెలుగు రేఖ

19-10-2024 12:00:00 AM

  1. దేశీయ వినియోగంతో వృద్ధి జోరు
  2. వరల్డ్ బ్యాంక్ చీఫ్ 

వాషింగ్‌టన్, అక్టోబర్ 18: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వృద్ధి రేటు ఒక వెలుగురేఖగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా అభివర్ణించారు. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వార్షిక సదస్సు వచ్చేవారం జరగనున్న నేపథ్యంలో బంగా మీడియాతో మాట్లాడుతూ భారత్ వృద్ధిలో చాలావరకూ దేశీయ మార్కెట్ ద్వారా సాధించుకుంటున్నదని చెప్పారు.

భారత్‌కు ఆరు నుంచి ఏడు శాతం, అంతకు మించి వృద్ధిచెందే సత్తా ఉన్నదన్నారు. భారత్ వృద్ధిలో అధికభాగం దేశీయ వినియోగం ద్వారానే ఒనగూడుతున్నదని, అది ఆరోగ్యకరమైన వృద్ధిగా పరిగణించవచ్చని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. 

జీవిత నాణ్యతపై దృష్టిపెట్టాలి

భారత్ ఇక నుంచి తన ప్రజల జీవిత నాణ్యతపై  దృష్టినిలపాలని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు తదితరాలు లభించేలా ప్రభుత్వం చూడాల్సి ఉన్నదని బంగా సూచించారు. ఇటువంటి పలు అంశాలపై తాము భారత్‌తో కలిసి కసరత్తు చేస్తున్నామని, ఇందుకోసం తగిన ప్రాజెక్టులు వచ్చే కొద్ది నెలల్లో వస్తాయని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఉద్యోగ కల్పన, అభివృద్ధి కొనసాగించడానికి ప్రపంచ బ్యాంక్ భారత ప్రభుత్వానికి మద్దతును ఇస్తున్నదని వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నా బెనర్జీ చెప్పారు. భారత్‌లోని నగరాలు జీవనానికి మరింత యోగ్యమైనవిగా అభివృద్ధి పర్చేదిశగా  గాలి నాణ్యతను, నీటి సరఫరా ప్రణాళికల్ని మెరుగుపర్చడానికి ప్రపంచ బ్యాంక్ భారత్‌తో కలిసి పనిచేస్తున్నదని తెలిపారు.  భారత్ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెంచే అవకాశం ఎంతగానో ఉన్నదని చెప్పారు.