calender_icon.png 15 October, 2024 | 5:56 AM

యూఎస్ బాండ్లలో భారత్ పెట్టుబడులు 242 బిలియన్ డాలర్లు

19-08-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 18: యూఎస్ ప్రభుత్వ బాండ్లలో భారత్ పెట్టుబడులు ఈ ఏడాది జూన్ చివరినాటికి 241.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అమెరికా బాండ్లలో భారత్ పెట్టుబడుల్ని పెంచుకుంటూపోవడం వరుసగా ఇది మూడో నెల. యూఎస్ సెక్యూరిటీల్లో పెట్టుబడి చేసిన దేశాల్లో జపాన్, చైనాలు ప్రధమ, ద్వితీయస్థానాల్ని ఆక్రమిస్తున్నాయి. జపాన్ 1.11 ట్రిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌చేయగా, చైనా పెట్టుబడులు 780.2 బిలియన్ డాలర్ల మేర ఉన్నట్టు యూఎస్ ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా బాండ్లలో 741.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో యూకే తృతీయస్థానంలోనూ, 384.2 బిలియన్ డాలర్ల హోల్డింగ్స్‌తో లగ్జంబర్గ్ నాల్గవ స్థానంలోనూ ఉన్నాయి.

241.9 బిలియన్ డాలర్ల యూఎస్ బాండ్లు కలిగిన భారత్ 12వ స్థానంలో ఉన్నది. మే నెలలో ఈ పెట్టుబడులు 237.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది జూన్ నెలలో 240.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, అవి ఈ ఏడాది మార్చికల్లా 233.5 బిలియన్ డాలర్లకు తగ్గిన అనంతరం తిరిగి ఈ జూన్‌లో రికార్డుస్థాయికి చేరాయి. టాప్ టెన్ హోల్డర్లలో కెనడా 374.8 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, కేమాన్ ఐలాండ్స్ 319.4 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, బెల్జియం 318 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో, 308 బిలియన్ డాలర్లతో ఐర్లాండ్ ఎనిమిదో స్థానంలో, 307.2 బిలియన్ డాలర్లతో ఫ్రాన్స్ తొమ్మిదో స్థానంలో, 287.1 బిలియన్ డాలర్లతో స్విట్జర్లాండ్ పదో స్థానంలో నిలిచాయి. 265.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో తైవాన్ 11వ స్థానంలో ఉన్నది.