ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు రానురాను పెరుగుతున్నది. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటింది. భద్రతా మండలి ఏర్పడినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.
ఈ మార్పులకు అనుగుణంగా భద్రతామండలితో పాటుగా ఇతర అంతర్జాతీయ వేదికల్లో మార్పులు రావాలని భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా మండలిలో ఇప్పటికీ అయిదు దేశాలకు వీటో అధికారం ఉంది. అమెరికా, రష్యా చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు మాత్రమే శాశ్వతసభ్య దేశాలుగా ఉండగా, మిగతావి తాత్కాలిక సభ్య దేశాలుగా రొటీన్ పద్ధతిలో ప్రతి రెండేళ్లకోసారి మారుతుంటాయి.
అయితే గత 75 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నోమార్పులు వచ్చాయి. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల ప్రాధాన్యత పెరిగింది. జనాభా దృష్ట్యానే కాకుండా, బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలిని తాజా పరిస్థితులకు అనుగుణంగా విస్తరించాలని, మరిన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని మన దేశంతో పాటుగా ఆయాదేశాలు గట్టిగా కోరుతున్నాయి.
ఈ డిమాండ్‌కు ఐక్యరాజ్యసమితి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపి చాలా ఏళ్లయినప్పటికీ సంస్కరణలు మాత్రం అమలుకు నోచుకోలేదు. చాలా సందర్భాల్లో ఈ అంశం ఐరాసలో ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా చైనా వీటో రూపంలో దీనికి మోకాలడ్డుతూ వస్తున్నది. గతంలో చైనాకు వంతపాడే రష్యా కూడా భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
తాజాగా జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్‌తో పాటుగా జపాన్, జర్మనీ, ఆఫ్రికా దేశాలనుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌లు ప్రకటించారు. తాజాగా బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్టర్ కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని, అలాగే ఆఫ్రికానుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. భద్రతా మండలిలో తగినన్ని సభ్య దేశాలు లేనంతవరకు ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టమని, అందువల్ల భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలన్నారు.
నిజానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ చాలా సంవత్సరాలుగా కోరుతోంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో పోఖ్రాన్ అణు పరీక్ష జరిగినప్పటినుంచి ఈ డిమాండ్ ఉంది. ప్రపంచ జనాభాలో అత్యధిక భాగం భారత్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నప్పటికీ భద్రతా మండలిలో ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం లేదు.
నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించే విధంగా భద్రతా మండలిని విస్తరించాలనే డిమాండ్ ఈ అన్ని ప్రాంతాల దేశాలనుంచి వివిధ వేదికలపై బలంగా వినిపిస్తోంది. తాజాగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోరియో గుటెరిస్ సైతం అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భారత్ విశ్వ దేశమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాల్లో నాలుగు దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నా చైనా మాత్రం తన రాజకీయ కారణాల దృష్ట్యా దీనికి మోకాలడ్డుతోంది. అయితే ఇది ఎంతోకాలం సాగదని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఖాయమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించడం చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.