calender_icon.png 2 November, 2024 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సగర్వంగా సెమీస్‌కు

23-06-2024 01:32:46 AM

నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా): టీ20 ప్రపంచకప్‌లో అపజయమన్నదే ఎరగకుం డా ముందుకు సాగుతున్న భారత్.. సెమీఫైన ల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన.. సూపర్ వరుసగా రెండో విజయంతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. గత మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ అండ్ కో.. బంగ్లాపైనా అదే జోరు కొనసాగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు చేసింది.

నార్త్‌సౌండ్ మైదానంలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది మూడో అత్యధిక స్కోరు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. విరాట్ కోహ్లీ (37; ఒక ఫోర్, 3 సిక్సర్లు), రిషబ్ పంత్ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబే (34; 3 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (23; 3 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తన్జీమ్ హసన్, రిషాద్ హుసేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో (40; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేయగా.. అతడికి మిగిలిన వాళ్ల నుంచి సహకారం కరువైంది. షకీబ్ అల్ హసన్ (11), లిటన్ దాస్ (13), తౌహిత్ హృదయ్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, అర్ష్‌దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సూపర్ భాగంగా తమ చివరి మ్యాచ్‌లో సోమవారం ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. 

ఆద్యంతం తడబడి..

ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో పరాజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న బంగ్లాదేశ్.. భారీ లక్ష్యఛేదనలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ రేసులో నిలిచే పరిస్థితుల్లో ఆ జట్టు బ్యాటర్లు సత్తాచాటలేకపోయారు. కెప్టెన్ నజ్ముల్ ఒక్కడే కాస్త పోరడగా.. మిగిలినవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించిన అనంతరం లిటన్ దాస్‌ను హార్దిక్ ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ ఇవ్వగా.. చివరి వరకు వికెట్ల పతనం అలాగే సాగింది. కరీబియన్ పిచ్‌లపై ఖతర్నాక్ అనిపించుకుంటున్న కుల్దీప్ మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో బంగ్లా కోలుకోలేకపోయింది. బుమ్రా, అర్ష్‌దీప్ కూడా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.