బంగ్లాదేశ్‌లో కొన్నేండ్లుగా అతివాద ఇస్లామిస్టుల ప్రభావం పెరుగుతూ వస్తున్నది. భారత ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించే వేర్పాటువాద సంస్థలు కూడా బంగ్లా కేంద్రంగా పనిచేసేవి. ఐఎస్‌ఐ ప్రోద్బలంతో నడిచే ఉగ్రవాద సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేవి. వీటన్నింటిని షేక్ హసీనా ఉక్కుపాదంతో అణచివేశారు. వేర్పాటువాదులు భారత్‌వైపు కన్నెత్తి చూడకుండా చేశారు.
ఆమె భారత్‌కు శక్తిమంతమైన మద్దతుదారు. ఇప్పుడు ఆమె అవమానకరంగా పదవి నుంచి వైదొలగి దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. భారత్ తన మద్దతుదారును కాపాడలేకపోయిందని దౌత్య నిపుణులు పెదవి విరుస్తున్నారు. నిన్నటివరకు జరిగిన ఉద్యమంలోనూ, కొత్త ప్రభుత్వలోనూ అందరూ భారత వ్యతిరేకులా ఉన్నారని చెప్తున్నారు.
శరణార్ధుల బెడద
బంగ్లా హింసలో తీవ్రంగా నష్టపోయింది మైనారిటీలే. గత రెండుమూడు రోజులుగా మైనారిటీలే లక్ష్యంగా అల్లరిమూకలు తీవ్ర దాడులకు పాల్పడ్డాయి. హిందూ ఆలయాలను తగులబెట్టాయి. వారి ఇండ్లను ధ్వంసం చేశాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడినా మైనారిటీలకు రక్షణ కల్పిస్తారన్న నమ్మకం లేదు. దీంతో మైనారిటీలు భారత్‌కు శరణార్ధులుగా వచ్చే అవకాశం ఉన్నది. అదే జరిగితే భారత్ వారికి ఆశ్రయం కల్పించక తప్పదు. ఈ సమస్యను మోదీ సర్కారు ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది.