calender_icon.png 17 November, 2024 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు మళ్లీ శరణార్థి సమస్య

10-08-2024 12:54:32 AM

  1. సరిహద్దుల్లో వేలమంది బంగ్లాదేశీయులు
  2. సైన్యం అడ్డుకొంటున్నా అక్కడే పడిగాపులు
  3. బంగ్లాదేశ్‌లో అల్లరిమూకల విచ్చలవిడి హింస
  4. ప్రాణాల కోసం పారిపోయి వస్తున్న మైనారిటీలు
  5. ఆశ్రయం ఇచ్చే అంశంపై భారత్ సందిగ్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం, చెలరేగిన హింస ఇప్పుడు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పొరుగుదేశంలో ఆందోళనకారులు ప్రభుత్వాన్ని కూల్చి, ప్రధానిని దేశం నుంచి తరమేసిన తర్వాత కూడా హింస ఆగకపోవటంతో మైనారిటీలు, అవామీలీగ్ పార్టీ మద్దతుదారులు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత సరిహద్దుకు పారిపోయి వస్తున్నారు. వారిని సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) బలగాలు దేశంలోకి రాకుండా అడ్డుకొంటున్నా.. బాధితులు అక్కడే మకాం వేశారు. దీంతో ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై భారత ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. 

మానవతా సంక్షోభం

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయి నాలుగు రోజులు గడిచిపోయినా హింస మాత్రం ఆగలేదు. దేశవ్యాప్తంగా మైనారిటీలు, అవామీ లీగ్ నేతలు, కార్యకర్తల ఆస్తులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అల్లరిమూకల చేతిలో 560 మంది మరణించారు. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి భారత్‌కు వచ్చిన తర్వాతే 230 మందిని ఛాందసవాదులు కొట్టి చంపేశారు. మృతుల్లో దాదాపు 300 మంది హిందువులు, ఇతర మైనారిటీలే ఉన్నట్టు ఉన్నట్టు ఆ దేశ మీడియా పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకొనేందుకు భారత్‌కు శరణార్థులుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాల మధ్య 4 వేల కిలోమీటర్లకుపైగా సరిహద్దు ఉన్నది. శరణార్థుల వలసల తాకిడి పశ్చిమ బెంగాల్‌కు అధికంగా ఉన్నది. ఆ రాష్ట్రంలోని కూచ్ బిహార్ సితల్ కుచిలో ఉన్న పటంతులి చెక్‌పాయింట్ వద్దకు వేలమంది బంగ్లాదేశ్ శరణార్థులు చేరుకొన్నారు. వారిని బీఎస్‌ఎఫ్ అడ్డుకొన్నది. దీంతో బంగ్లాదేశ్ సైనికులు వారిని సమీప పంటపొలాల్లోకి తీసుకెళ్లి గుంపుగా కూర్చోబెట్టిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

భారత ప్రభుత్వ కమిటీ

వందలాదిగా తరలివస్తున్న బంగ్లాదేశ్ మైనారిటీ శరణార్థులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై నరేంద్రమోదీ ప్రభు త్వం మల్లగుల్లాలు పడుతున్నది. ఈ పరిస్థితిని అధ్యయనం చేసి చక్కదిద్దేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. ‘ఈ కమిటీ బంగ్లాదేశ్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఆ దేశంలోని హిం దువులు, మైనారిటీలు, భారతీయుల భద్రతపై చర్చలు జరుపుతుంది’ అని పేర్కొన్నారు. 

నేను రాజకీయాల్లోకి వస్తా: హసీనా కుమారుడు

ప్రజాగ్రహానికి గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లటం తో ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో జమాతే సంస్థతోపాటు విపక్ష బీఎన్‌పీ నేతృత్వంలోని అల్లరిమూకలు అవామీ లీగ్ నేత లు, మద్దతుదారులను ఊచకోత కోస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని నిలబె ట్టేందుకు తాను రాజకీయాల్లోకి వస్తానని హసీనా కుమారుడు సాజీద్ వాజెడ్ ప్రకటించారు. గతంలో రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడేందుకు తన నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు తెలిపారు.