calender_icon.png 18 October, 2024 | 9:51 AM

భారత్ వృద్ధి 7 శాతం

26-09-2024 12:05:56 AM

వ్యవసాయ రంగం దన్ను

ఏడీబీ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి సాధిస్తుందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. వ్యవసాయ రంగం దిగుబడులు పెరగనుండటం, ప్రభుత్వం మూలధన వ్యయా ల పెంపుదలతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ఏడీబీ తన ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) సెప్టెంబర్ అప్‌డేట్‌లో వివరించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ జీడీపీ వృద్ధి 6.7 శాతానికి తగ్గినప్పటికీ, తదుపరి త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం మెరుగుదల కారణంగా వృద్ధి వేగవంతమవుతుందని పేర్కొంది. వచ్చే 2025 భారత్ వృద్ధి రేటు 7.2 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు తమ గత అంచనాలకంటే అధికంగా ఉంటాయ ని, సర్వీసుల ఎగుమతులు పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ వస్తూత్పత్తుల ఎగుమతులు మాత్రం మందకొడి గానే ఉంటాయన్నది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నదని, క్రమేపీ వృద్ధి పెరుగుతుందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా చెప్పారు.

వ్యవసాయ రంగం మెరుగుదలతో గ్రామీణ వినియోగ వ్యయాలు పెరుగుతాయని, తద్వారా పారిశ్రామిక, సర్వీసుల రంగాలు పుంజు కుంటాయని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో సగటుకంటే అధిక వర్షపాతం నమోదైనందున వ్యవసాయ వృద్ధి పటిష్ఠంగా ఉంటుందన్నారు.