- నేడు సౌతాఫ్రికాతో రెండో వన్డే
బెంగళూరు: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా రెండో విజయంపై కన్నేసింది. తొలి వన్డేలో భారీ విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఆత్మవిశ్వాసంతో రెండో వన్డేకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా జరగనున్న వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి వన్డేలో భారీ శతకంతో మెరిసిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తనకు అచ్చొచ్చిన బెంగళూరులో మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తోంది.
అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ వరుస వైఫల్యాలు ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు మ్యాచ్‌లు కలిపి షఫాలీ కేవలం 21 పరుగులు మాత్రమే చేసింది. రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్, హేమలత, రిచా ఘోష్, దీప్తి శర్మలు రాణిస్తే తిరుగుండదు. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, ఆశా శోభనలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని సఫారీలు భావిస్తున్నారు. కెప్టెన్ లారా, మారినే కాప్, సునే లుస్, అన్నెకెలు బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. కాకా, క్లాస్, డెర్క్సెన్లతో బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.