calender_icon.png 13 October, 2024 | 1:45 PM

2047కల్లా 55 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఎకానమీ

22-08-2024 12:30:00 AM

ఐఎంఎఫ్ ఈడీ సుబ్రమణియన్

కోల్‌కతా, ఆగస్టు21: డాలర్ల రూపేణా 12 శాతం వృద్ధి సాధించగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2027కల్లా 55 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. బుధవారం ఒక సీఐఐ సదస్సులో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రతీ ఆరేండ్లకు రెట్టింపు అవుతుందన్నారు.

ఈ లెక్కన ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్లు ఉన్న ఎకానమీ 2047కల్లా 55 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2016 నుంచి ద్రవ్యోల్బణం అదుపునకు చేస్తున్న ప్రయత్నాల కారణంగా ధరల సగటు పెరుగుదల 5 శాతంగా ఉన్నదని, అంతక్రితం ఇది 7.5 శాతం చొప్పున నమోదయ్యిందన్నారు.

2018 నుంచి 2021 వరకూ కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ వ్యవహరించారు. ఐదు శాతం ద్రవ్యోల్బణం రేటుతో 8 శాతం వాస్తవ వృద్ధి నమోదవుతుండగా, నామినల్ వృద్ధి 13 శాతం వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఐఎంఎఫ్ ఈడీ వివరించారు. దీర్ఘకాలికంగా చూస్తే డాలరు మారకంలో రూపాయి విలువ తగ్గుదల 1 శాతం లోపే ఉన్నదని, దీనితో డాలరు ప్రాతిపదికన భారత్ వాస్తవ వృద్ధి రేటు 12 శాతంగా ఉన్నట్టు పరిగణించవచ్చని చెప్పారు.