04-03-2025 10:52:20 PM
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy-2025)లో భారత్(Team India) ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈరోజు దుబాయ్ లో జరిగిన సెమీఫైనల్(Semifinal) లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 2023 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ వరుసగా గెలిచి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. దాంతో 140 కోట్ల మంది భారతీయుల కల చెదిరింది. ఇప్పుడు దానికి టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి వాల్యూబుల్ ఇన్నింగ్స్ తో అలరించాడు. కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) 28, శ్రేయస్ అయ్యర్ 45, అక్షర్ పటేల్ 27, హార్దిక్ పాండ్యా 28, కేఎల్ రాహుల్ 42 (నాటౌట్) జట్టు విజయంలో తలో చేయి వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2, మీడియా పేసర్ నేథన్ ఎల్లిస్ 2, బెన్ డ్వార్షూయిస్ 1, కూపర్ కనోలీ 1 వికెట్ తీశారు. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో భారత్ దుబాయ్ వేదికగా మార్చి 9న (ఆదివారం) ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.