calender_icon.png 30 December, 2024 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంకను జయించిన భారత్

10-10-2024 12:00:00 AM

రాణించిన మంధాన, హర్మన్

  1. సెమీస్ ఆశలు సజీవం 
  2. మహిళల టీ20 వరల్డ్ కప్

దుబాయ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం గ్రూప్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

ఓపెనర్లు మంధాన (50), షఫాలీ వర్మ (43) తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52*) వేగంగా ఆడడంతో భారత్ మెగాటోర్నీలో తొలిసారి భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌట్ అయింది.

దిల్హరి (21 పరుగులు), సంజీవని (20 పరుగులు) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఆశా శోభన, అరుంధతీ చెరో 3 వికెట్లు తీశారు. ఈ విజయంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న భారత్ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. లీగ్ దశలో భారత్ తమ చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో శనివారం ఆడనుంది.

నెమ్మదిగా ఆరంభించి..

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత ఓపెనర్లు మంధాన, షఫాలీ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు కేవలం 41 పరుగులు మాత్రమే చేశారు. మన బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది. ఒకసారి క్రీజులో కుదురుకున్న తర్వాత మంధాన, షఫాలీ గేర్లు మార్చారు. దీంతో స్కోరులో వేగం పెరిగింది.

అర్ధ సెంచరీ చేసి జోరు మీదున్న స్మృతి మంధాన 13వ ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగింది. దీంతో 98 పరుగుల తొలి వికెట్ భాగ స్వామ్యానికి తెరపడింది. వెంటనే షఫాలీ వర్మ కూడా వెనుదిరిగినప్పటికీ.. జెమీమాతో కలిసి కెప్టెన్ హర్మన్ ఫోర్లతో విరు చుకుపడటంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారీ టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది.

ఓపెనర్ గుణరత్నె (0) ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగింది. శ్రేయాంక పాటిల్ లంక కెప్టెన్ ఆటపట్టును బుట్టలో వేసుకోవడంతో లంక పతనం ప్రారంభమైంది. మూడో ఓవర్ వేసిన రేణుకా సింగ్ సమరవిక్రమ (3)ను పెవిలియన్ చేర్చింది.

దీంతో లంక స్కోరు వేగం మందగించడంతో పాటు పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి కేవలం 28 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లంకకు పరుగుల రాకపోగా రన్‌రేట్ కూడా భారీగా పెరిగిపోవడంతో పరాజయం   తప్పలేదు.

పాయింట్ల పట్టిక

గ్రూప్‌-ఏ 

జట్టు మ్యా గె పా రరే

ఆస్ట్రేలియా 2 2 0 4 +2.5

భారత్ 3 2 1 4 +0.5

పాకిస్థాన్ 2 1 1 2 +0.5

న్యూజిలాండ్ 2 1 1 2 -0.5

శ్రీలంక 3 0 3 0 -2.5

నోట్: మ్యా-మ్యాచ్‌లు, గె-గెలుపు, 

ఓ-ఓటమి, పా-పాయింట్లు, రరే-రన్‌రేట్