ప్రధానితో జైశంకర్ భేటీ
బంగ్లా పరిణామాలపై చర్చ
ఈ విషయంలో కేంద్రానికి అండగా ఉంటామన్న మమతా బెనర్జీ
ఇస్కాన్‌పై నిషేధానికి ఢాకా హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ, నవంబర్ 28: బంగ్లాలో ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టు, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కలిసి బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారన్న దానిపై మాత్రం సమాచారం బయటకు రాలేదు. అయితే, శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగితే ఈ అంశంపై జైశంకర్ మాట్లాడే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.
కేంద్రానికి మద్దతిస్తాం: మమతా
బంగ్లాలోని ఉద్రిక్తితలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బెంగాల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఖండిస్తున్నట్టు ప్రకటించారు. చిన్మయ్ అరెస్ట్‌పై స్థానిక ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. అరెస్ట్ అంశం విదేశానికి సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తమ ప్రభత్వం కేంద్రానికి అండగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం మతాల విషయంలో సామరస్యాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం బంగ్లాలోని పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇస్కాన్‌పై నిషేధానికి హైకోర్టు నిరాకరణ
ఇస్కాన్‌పై నిషేధం విధించడానికి బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. దేశంలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలంటూ కోరిన పిటిషనర్ వాదనను హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. అయితే, సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే బుధవారం ఇస్కాన్ విషయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బృందం ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపింది. ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, దానిపై నిషేధం విధించాలని కోరుతూ 10 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వానికి పంపిన నోటీసుల్లో కోరారు.
బైడెన్, ట్రంప్ చర్యలు తీసుకోవాలి
బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిక్ స్టేట్ మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్‌ఐఐడీఎస్) సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలులో పెట్టడం, హిందువులు, ఇతర మైనారిటీలపై కొనసాగుతన్న దాడులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను ఎఫ్‌ఐఐడీఎస్ అధ్యక్షుడు ఖండేరావ్ కాండ్ బుధవారం ఓ లేఖలో కోరారు.