- ఎల్‌వోసీ వెంట గస్తీకి ఓకే
- బలగాల ఉపసంహరణకు అంగీకారం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: వాస్తవాధీన రేఖ( ఎల్‌ఏసీ) వెంబడి గస్తీని తిరిగి ప్రారంభించడానికి భారత్, చైనా దేశాలు అంగీకరిం చాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది. అలాగే లఢక్ సరిహద్దు వెంబడి బలగాల ఉపసంహరణకు ఓ ఒప్పందానికి వచ్చాయని వెల్లడించింది.
వీటితోపాటు గల్వాన్ సమస్యలను పరిష్కరించ డానికి ఈ చర్చలు దోహదపడుతాయని తెలిపింది. ఇరుదేశాల చర్చల నేపథ్యంలో ఎల్‌ఏ సీ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీని పరిష్కారం కోసం ఇరుదేశాల సైనికాధికారులు అనేకసార్లు చర్చలు జరిపారు. ప్రస్తుతం జరిగిన చర్చల్లో పురోగతి ఏర్పడింది.
2020లో భారత్-చైనా బార్డర్‌లోని గల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో తమ ప్రాంతాల వైపు ఇరుదేశాలు భారీస్థాయిలో బలగాలను అక్కడికి తరలించాయి.
అప్పటినుంచి ఎల్‌ఏసీ వద్ద ప్రతిష్టంభన నెలకొనడంతో అక్కడ సాధారణ పరిస్థితిని తీసుకురావడానికి ఇరుదేశాల సైనిక అధికారులు చాలాసార్లు చర్చించారు. అయితే అక్టోబర్ 22, 23 తేదీల్లో రష్యాలో జరిగే బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానకి మోదీ వెళ్లనున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో ఈ కీలక పరిణామం చోటుచేసుకోనుంది.