calender_icon.png 28 October, 2024 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్ వాటా

28-06-2024 01:40:36 AM

  • రూ.1,900 కోట్ల లావాదేవీ

ముంబై, జూన్ 27: దక్షిణాది సిమెంట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ పావులు కదిపింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను కొంటున్నట్టు గురువారం ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడైన ఎన్ శ్రీనివాసన్ ప్రమోట్ చేసిన ఇండియా సిమెంట్స్‌లో దమాని గ్రూప్ వాటాను స్టాక్ ఎక్సేంజీల్లో రెండు బ్లాక్ డీల్స్‌లో కొనుగోలు చేసినట్టు అల్టాటెక్ వెల్లడించింది. అయితే ఇండియా సిమెంట్స్ ప్రమోటర్లయిన శ్రీనివాసన్ కుటుంబం వద్దే అత్యధికంగా 28.42 శాతం వాటా ఉంటుంది. బీఎస్‌ఈలో బ్లాక్‌డీల్ డాటా ప్రకారం అల్ట్రాటెక్ సిమెంట్ 7,05,64,656 షేర్లను (22.77 శాతం వాటా)ను అల్ట్రాటెక్ కొన్నది.

ఈ బ్లాక్ డీల్స్ షేరుకు రూ.265.05 సగటు ధరపై జరిగాయి. రెండు బ్లాక్ డీల్స్ మొత్తం లావాదేవీ విలువ రూ.1,889 కోట్లు. ఈ షేర్లను గోపికిషన్ దమాని, కిరణ్‌దేవి దమాని, రాధాకిషన్ దమాని, శ్రీకాంతదేవి దమానిలు విక్రయించారు. రాధాకృష్ణ దమానికి చెందిన రెండు ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు సైతం షేర్లను ఆఫ్‌లో చేశాయి. తాజా లావాదేవీతో ఇండియా సిమెంట్స్‌లో రెండవ పెద్ద షేర్‌హోల్డరుగా అల్ట్రాటెక్ అవతరిస్తుంది. ఇండియా సిమెంట్స్‌కు 16 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన త్రినేత్ర సిమెంట్‌కు 1.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్నది.

అదానీ గ్రూప్‌తో పోటీ

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పెన్నా సిమెంట్‌ను రూ. 10,422 కోట్లకు అదానీ గ్రూప్ టేకోవర్ చేసిన రెండు వారాలకే అల్ట్రాటెక్ దక్షిణాదిలోని మరో పెద్ద కంపెనీ ఇండియా సిమెంట్స్‌లో వాటా కొనుగోలు చేయడం గమనార్హం. కొద్ది నెలల క్రితం కేశోరామ్ సిమెంట్స్‌ను, ఇటీవల పెన్నా సిమెంట్‌ను టేకోవర్ చేయడంతో అదానీ గ్రూప్ సిమెంటు వార్షిక ఉత్పాదక సామర్థ్యం 93 మిలియన్ టన్నులకు చేరింది.

అల్ట్రాటెక్‌కు ప్రస్తుతం 152.7 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉన్నది. 24 ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్లు, 33 గ్రైండింగ్ యూనిట్లు, ఒక క్లింకరైజేషన్ యూనిట్, 8 బల్క్ ప్యాకేజింగ్ టెర్మినళ్లు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్‌లో వాటా కొనుగోలు కేవలం ఆర్థిక పెట్టుబడిగా అల్ట్రాటెక్ పేర్కొన్నది. తాజా డీల్ నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 5.07 శాతం పెరిగి రూ. 11,715 వద్ద, ఇండియా సిమెంట్ షేరు 11.49 శాతం పెరిగి రూ. 293 వద్దకు చేరాయి.