calender_icon.png 17 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ను ఇక భయపెట్టలేరు

17-11-2024 01:54:50 AM

ఇప్పుడు ఉగ్రవాదుల ఇళ్లల్లోనే భద్రత లేదు

ప్రస్తుతం భారత్ పూర్తిగా మారిపోయింది

మా పాలనను 3 సార్లు ప్రజలు నమ్మారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఒకప్పుడు భారత్‌ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఉగ్రవాదులు ప్రస్తుతం తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు వారంతా తమ దేశంలో భయంభయంగా జీవిస్తున్నారని పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు.

సదస్సు నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 26/11 ముంబై పేలుళ్ల కథనాలను చూసిన మోదీ స్పందిస్తూ.. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు అతిపెద్ద ముప్పుగా ఉండేది. ప్రజల భద్రతపై అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వాళ్లే సొంత ఇళ్లలో భయంగా బతుకుతున్నారు. ఇక వాళ్లు మనల్ని భయపెట్టలేరు అని పేర్కొన్నారు. 

ప్రజలు మమ్మల్ని నమ్మారు

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తుందని, ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు. ప్రజల కోసం, ప్రజలతోనే అభివృద్ధి అనేది తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకు 3 పర్యాయాలు భారతీయులు మద్దతు తెలిపారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని చిత్తశుద్ధితో నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని మోదీ ప్రస్తావించారు.

వీటిని నివారించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. 

యువతలో స్ఫూర్తి పెరిగింది

భారత్ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి కొరవడిందని మోదీ అన్నారు. కానీ, గత పదేళ్లలో ఇది పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 1.25 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని వెల్లడించారు. దేశానికి ఖ్యాతి తెచ్చేందుకు ప్రస్తుతం యువత ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా పారిశుద్ధ్యం, ఉపాధి కల్పనపైనా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మోదీ అన్నారు.

దేశంలో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించాలనే మేం భావించాం. ఇందుకోసం తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి విస్తృతంగా ప్రచారం చేశాం. ఇందుకోసం పథకాలను తీసుకొచ్చాం. ఇది ఉపాధిని కూడా సృష్టించింది. ఈ పథకం ద్వారా గౌరవంతో పాటు భద్రతను అందించింది అని మాట్లాడారు.