26-03-2025 12:07:22 AM
23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు!
న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య గల వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన సగానికిపైగా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లను తగ్గించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రెండు దేశాల ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం వెలువరించింది. తమ ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై ఏప్రిల్ 2 నుంచి అదే స్థాయిలో టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. భారత్‌పై కూడా ఏప్రిల్ 2 నుంచి కొత్త టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో భారత ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం విధించే టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. భారత ప్రభుత్వం అంతర్గత విశ్లేషణ ప్రకారం అమెరికా కొత్త టారిఫ్‌లు సుమారు 66 బిలియన్ డాలర్ల విలువైన 87శాతం భారత ఎగుమతులపై ప్రభావితం చూపిస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రభావాన్ని నివారించడానికి ప్రస్తుతం 5 పన్ను విధిస్తున్న 55శాతం అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టుగా రాయిటర్స్ తన నివేదికలో తెలిపింది. కాగా ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని, ప్రభుత్వం ఇంకా దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోలేదని సమాచారం.