calender_icon.png 11 October, 2024 | 5:03 AM

భారత్-ఆసియాన్ స్నేహం కీలకం

11-10-2024 02:24:57 AM

లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ 

యాక్ట్-ఈస్ట్ విధానంపై ప్రసంగించిన మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లావోస్‌లోని వియంటైన్‌లో జరిగిన 21వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రసంగించారు. ఈ పర్యటన ఆసియాన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. భారతదేశం ప్రవేశపెట్టిన యాక్ట్-ఈస్ట్ విధనం ద్వారా న్యూఢిల్లీ దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఊపందుకున్నాయని అన్నారు. 

ప్రపంచ వివాదాల నేపథ్యంలో భారత్-ఆసియాన్ సహకారం ప్రస్తుతం చాలా అవసరమని మోదీ నొక్కిచెప్పారు. ఆసియాన్ దేశాలతో బహులపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం చేపట్టిన పలు కార్యక్రమాలను మోదీ తన ప్రసంగంలో చేర్చారు. ‘ ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం భారత్ సముద్ర కసరత్తులు ప్రారంభించిందన్నారు.

గత పదేళ్లలో ఏసియన్ దేశాలతో మా వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి దాదాపు 130 బిలియన్ డాలర్లకు పెరింగిందన్నారు. ప్రస్తుతం భారతదేశం 7 ఆసియాన్ దేశాలతో నేరుగా విమాన కనెక్టివిటీ కలిగి ఉంది.. త్వరలో బ్రూనైకి కూడా నేరుగా విమానాలు ప్రారంభిస్తాం’ అని మోదీ అన్నారు. 

ఇది భారత్-ఆసియాన్ శతాబ్దం..

భారత్- ఏసియన్ పరస్పర సహకారం ఈ దశాబ్దంలోనే అత్యంత కీలకంకానుందని మోదీ పునరుద్ఘాటించారు. భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 300 మంది ఏసియన్ దేశాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశామని మోదీ తెలిపారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్ధం అని మోదీ స్పష్టం చేశారు.

‘ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, యుద్ధాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, ఆసియాన్‌ల స్నేహం, సహకారం చాలా ముఖ్యం’ అని మోదీ అన్నారు. ఈ ఉదయం లావోస్ చేరుకున్న ప్రధాని మోదీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐలు ఆయనకు భారత జెండాలను చేతబట్టి ఘన స్వాగతం పలికారు. అక్కడి చిన్నారులను మోదీ ఆప్యాయంగా పలకరించి వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.