అందరి భాగస్వామ్యంతో మోదీ ప్రభుత్వం సాధిస్తుంది
2030 నాటికి 10 కోట్ల టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ లక్ష్యం
స్టార్టప్ సంస్కృతి మన దేశ ప్రగతి కొత్త అధ్యాయం
వాణిజ్య, వ్యాపారవేత్తల సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): బ్యాంకింగ్ సంస్కరణలు, డిజిటలైజేషన్ సంస్కరణలు దేశాన్ని వేగంగా ముందుకు నడిపించాయని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. స్టార్టప్ సంస్కృతి మన దేశ ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించిందన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణలో జరిగిన వాణిజ్య, వ్యాపారవేత్తల ఆత్మీయ సదస్సులో కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2015 నుంచి ప్రైవేటు రంగానికి అనేక ప్రోత్సాహకాలు అందించామ న్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు అన్ని రంగాలకు అవసరమైన సహకారం అందిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలకు అండగా ఉందని, భారత్‌ను మళ్లీ విశ్వగురువుగా చేసేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం చాలా కీలకమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వా నికి, పారిశ్రామికవేత్తలకు మధ్య నిర్మాణాత్మకమైన చర్చకు ఈ వేదిక చాలా కీలకమైంద న్నారు. ఇలాంటి నిర్మాణాత్మక చర్చల ద్వారా నే అందరి భాగస్వామ్యంతో దేశ భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే క్రమంలో మనకు ఎదురయ్యే సవాళ్ల గురించి భారతీయ కార్పొరేట్ కంపెనీలతో చర్చించేందుకు, వినూత్న ఆలోచనలు పంచుకోవడా నికి, శక్తిమంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదికగా కిషన్‌రెడ్డి అభివర్ణించారు. పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతికత అభివృద్ధికి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉందన్నారు. హైదరాబాద్‌లో తయారైన వ్యాక్సిన్ యావత్ ప్రపంచంలో కరోనా భయాన్ని తొలగించిందన్నారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం, సాంకేతి క పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతిని సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెంచడానికి, ప్రపంచంతో మన దేశం పోటీ పడటానికి వ్యాపారవేత్తల పెట్టుబడి, వినూత్న ఆలోచనలు కీలకమైనవని గుర్తుచేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దశాబ్ద కాలంలో దేశ గతిని మార్చే సంస్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీముల వల్ల అనేక రంగాల్లో స్థానికంగా ఉత్పాదకత పెరిగిందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రో గ్రాంలో భాగంగా అనేక ఆర్‌అండ్‌డీ సంస్థలకు గ్రాంట్లు లభించాయన్నారు. ఏఐ, స్పేస్ టెక్నాలజీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ప్రోత్రహిస్తున్నామని తెలిపారు.