* రూ.1.25లక్షల కోట్లు దాటిన దేశ రక్షణ ఉత్పత్తులు
* 100పైగా దేశాలకు భారత రక్షణ పరికరాల ఎగుమతి
* జలాంతర్గామి, రెండు యుద్ధ నౌకల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
ముంబై, జనవరి 15: భారత నౌకాదళం మరింత బలంగా మారింది. అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లు బుధవారం నౌకాదళంలో చేరాయి. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరై యుద్ధ నౌకలను జాతికి అంకితం ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో బలమైన నావికాశక్తిగా భారత్ ఎదుగుతోందని పేర్కొ న్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు విస్తరిస్తున్న నౌకల తయారీ పరిశ్రమ తన వంతు సాయం అందిస్తుందన్నారు.
భారత నౌకాదళానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొత్త బలాన్ని, విజన్‌ను అందజేశారని పేర్కొన్నారు. ఆయన నడియాడిన నేల నుంచి 21వ శతాబ్దపు నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి పెద్ద ముందడుగు వేసినట్టు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, ఏడు జలాంత ర్గాములు నేవీలో చేరిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. రక్షణరంగ బలోపేతానికి నిరంతంర కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25లక్షల కోట్లు దాటినట్టు వెల్లడించారు. 100పైగా దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు.
అలాగే ప్రపంచలో భారత్ నమ్మకమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందన్నారు. భారత్ అభివృద్ధి స్ఫూర్తితో పని చేస్తుందే తప్ప విస్తరణవాదంతో కాదన్నారు. భారత్ ఎల్లప్పు డూ సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో రీజియన్‌కు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
జలాంతర్గామి, యుద్ధ నౌకల విశేషాలు ఇవే
Fప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్ సూరత్ ఒకటి. పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన నాలుగో యుద్ధనౌక ఇది. ఐఎన్‌ఎస్ సూరత్ తయారీలో 75శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీనిలో అధు నాతన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం.
Fఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌ను హంటర్ కిల్లర్ అనే పేరు కూడా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. పీ75 కింద రూపొందించిన చివరి జలాంతర్గామి ఇదే.
Fపీ17ఏ స్టీల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందిన మొట్టమొదటి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ నీలగిరి. దీన్ని ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకను డిజైన్ చేసింది. శత్రువులను ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.