01-05-2024 12:05:00 AM
భారత్ సూపర్ పవర్ కావాలనుకుంటున్నది
మనమేమో దివాళా దిశగా పోతున్నాం
పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మౌలానా ఫజ్లూర్ రెహమాన్
ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: భారత్ గ్లోబల్ సూపర్ పవర్ కావాలనుకుంటుంటే, పాకిస్థాన్ మాత్రం ఇప్పటికే అప్పుల కోసం అడుక్కుంటూ, ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసే దిశగా వెళ్తున్నదని ఆ దేశపు ప్రతిపక్ష నేత, జమియత్ ఉలేమా ఎ ఇస్లాం అధినేత మౌలానా ఫజ్లూర్ రెహమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ఆయన తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ద్రవ్యలోటుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 3 బిలియన్ డాలర్లను అప్పుగా పొందుతున్నది.
దీనిలో భాగంగా చివరి విడత అప్పును ఐఎంఎఫ్ సోమవారం విడుదల చేసేందుకు అంగీకరించిం ది. ‘భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. భారత్ ఒకవైపు రోదసీలోకి చంద్రయాన్లు పంపిస్తున్నది. జీ20 సమావేశాలు నిర్వహిస్తున్నది. అగ్రరాజ్యాలకు దీటు గా ఎదుగుతున్నది. పాకిస్థాన్ ఎందుకు భారత్‌లా ఎదగలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?’ అని రెహమాన్ ప్రశ్నించారు. ఇటీవల పాక్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలనూ ఆయన విమర్శించారు. ఇక్కడ పాలకులు ఎవరనేది రాజభవనాల్లో ఖరారు అవుతుందని, ప్రధాని ఎవరనేది బ్యూరోక్రాట్లు నిర్ణయిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.