calender_icon.png 18 October, 2024 | 10:04 AM

మూడోరోజూ నష్టాల్లో సూచీలు

18-10-2024 01:18:26 AM

  1. 24,750 దిగువకు నిఫ్టీ
  2. బజాజ్ ఆటో షేరు 13 శాతం డౌన్

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరసగా మూడో రోజూ  నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికే వెలువడిన త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ను మెప్పించకపోవడం మరో కారణం.

దీంతో సూచీలు రెండు నెలల కనిష్టానికి చేరాయి. గురువారం వెలువడనున్న విప్రో, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించనునున్నారు. బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా బజాజ్ ఆటో షేర్లు ఇవాళ 13 శాతం మేర కుంగాయి. సెన్సెక్స్ ఉదయం 81,758.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,501.36) లాభాల్లో ప్రారంభమైంది.

కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 80,905.64 కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 494.75 పాయింట్ల నష్టంతో 81,006.61 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 221.45 పాయింట్ల నష్టంతో 24,749.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.

సెన్సెక్స్‌లో  నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్  కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.57 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2696.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

భారీ నష్టాల్లో బజాజ్ ఆటో షేర్లు

బజాజ్ ఆటో షేర్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో 13.11 శాతం క్షీణించి రూ. 1523 నష్టంతో రూ.10,093.50 వద్ద ముగిశాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.1,385 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.2,020 కోట్లతో పోలిస్తే ఇది 31శాతం తక్కువ. దీంతో వివిధ బ్రోకరేజీ సంస్థలు బజాజ్ ఆటో షేరు టార్గెట్ విలువను తగ్గించడంతో షేర్లు భారీగా కుంగాయి.