calender_icon.png 20 January, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ లాభాల్లో సూచీలు

27-07-2024 12:48:55 AM

రూ.7లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు  బడ్జెట్ షాక్ నుంచి తేరుకున్నాయి. ఐదు రోజుల వరుస నష్టాల అనంతరం దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ఐటీ స్టాక్స్ సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా కనిష్టాల వద్ద కొనుగోళ్ల వ్యూహం, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి స్టాక్స్ రాణించడం సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో 1300 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ 24,800 ఎగువన ముగిసింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6.92 లక్షల కోట్లు పెరిగి రూ.456.74 లక్షల కోట్లకు చేరింది.సెన్సెక్స్ ఉదయం 80,158.50 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,039.80) స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.

కొనుగోళ్ల ఉత్సాహంతో ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,427.18 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 1292.92 పాయింట్ల లాభంతో 81,332 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 428.85 పాయింట్ల లాభంతో 24,834.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.64గా ఉంది. సెన్సెక్స్‌లో నెస్లే ఇండియా మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.95 డాలర్లు, ఔన్సు బంగారం ధర 2,372 డాలర్ల వద్ద కొనసాగుతోంది.అమెరికా ఆర్థికవ్యవస్థ రెండో త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడం ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఉత్సాహానికి కారణమైంది.

సాధారణంగా ఐటీ కంపెనీలకు మెజారిటీ ఆదాయం అమెరికా నుంచే వస్తుండటం ఇందుకు నేపథ్యం. కనిష్టాల వద్ద కొనుగోళ్లు మరో కారణమని అనలిస్టులు చెబుతున్నమాట. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ షేర్లు కలిపి సెన్సెక్స్ 500 పాయింట్ల మేర పరుగులు తీయడానికి కారణమయ్యాయి.