calender_icon.png 16 January, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిష్ఠాలను తాకిన సూచీలు

03-09-2024 03:38:58 AM

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు కొనసాగినా.. ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్ మద్దతుతో సూచీలు వరుసగా 13వ రోజూ సూచీలు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే మరోసారి సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 25,300 పాయింట్లు దాటింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్ ఉదయం 82,725.28 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,365,77) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,725.28 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాల వద్ద తాకిన సూచీ.. చివరికి 194.07 పాయింట్ల లాభంతో 82,559.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 42.80 పాయింట్ల లాభంతో 25,278.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.92గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ 76 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2532 డాలర్ల వద్ద కొనసాగుతోంది.