calender_icon.png 5 October, 2024 | 4:52 AM

స్వతంత్ర దర్యాప్తు

05-10-2024 02:49:58 AM

  1. తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశం 
  2. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు
  3. సిట్‌లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ అధికారులు
  4. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక నిపుణుడు

* ‘పిటిషన్లలోని ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి మేం వెళ్లటం లేదు. న్యాయస్థానాన్ని రాజకీయ పోరాటకేంద్రంగా మార్చుతామంటే మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఇది కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశం కాబట్టి స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు జరిపించాలి. దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శంచే ఆలయంలో పవిత్రమైన ప్రసాదం కల్తీ కావటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదు.                  

సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రసాదం లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారన్న ఆరోపణలపై స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో దర్యాప్తు జరిపిం చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ అంశం కోట్ల మంది భక్తులకు సంబంధించిన వ్యవహారమని, రాజకీయాలకు తావులేదని స్పష్టంచేసింది. లడ్డు కల్తీపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడి ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘పిటిషన్లలోని ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి మేం వెళ్లటం లేదు.

న్యాయస్థానాన్ని రాజకీయ పోరాటకేంద్రంగా మార్చుతామంటే మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఇది కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశం కాబట్టి స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు జరిపించాలి. సిట్‌లో ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఇద్దరు సీబీఐ అధికారులతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిపుణుడు ఉండాలి. ఈ సిట్ దర్యాప్తు కూడా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. 

సీరియస్ అంశమే

లడ్డు కల్తీ అయ్యిందన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవేనని ధర్మాసనం పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. దేశం నలుమూలల నుంచి భక్తులు సందర్శంచే ఆలయంలో పవిత్రమైన ప్రసాదం కల్తీ కావటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అన్నారు.

అందుకు స్పందించిన జస్టిస్ గవాయ్.. ‘ఇది సీరియస్ అంశం అనేదానిపై ఎవరికీ సందేహాలు లేవు’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసిందని, అది దర్యాప్తు చేయటంలో తప్పేమీ లేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో రాష్ట్ర సిట్‌తో దర్యాప్తు చేయించవచ్చని సూచించారు.

కానీ, అందు కు ధర్మాసనం ఒప్పుకోలేదు. స్వతం త్ర సిట్‌తోనే దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ‘ఆహార నాణ్యతను పరీక్షించటంలో దేశంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అత్యంత నమ్మమైన శిఖర స్థాయి సంస్థ. ఈ అంశం రాజకీయ నాటకంగా మారటానికి మేం అవకాశం ఇవ్వద లుచుకోలేదు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపితే దానిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది’ అని ధర్మాసనం వివరించింది. 

టీడీపీ వర్సెస్ వైసీపీ

సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ మాటల దాడికి దిగాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చీరాకముందే మీడియా సమావేశం పెట్టిన వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం.. కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకంలేకనే స్వతంత్ర సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించిందని తెలిపారు. జగన్ విమర్శలను టీటీపీ నేత పయ్యావుల కేశవ్ తిప్పికొట్టారు. సుప్రీంకోర్టు తీర్పును జగన్ వక్రీకరించారని ఆరోపించారు.