ఎల్బీనగర్, ఫిబ్రవరి 4 : వనస్థలిపురం స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీనగర్ కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత తెలిపిన వివరాలు.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరబిక్ భాష నేర్పిస్తూ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై 2019లో కేసు నమోదైంది.
బీహార్ రాష్ట్రం బంకా జిల్లా బరాహత్ మండలం నయాది గ్రామానికి చెందిన మహమ్మద్ షాహబాజ్ (36) అరబిక్ ఉపాధ్యాయుడు. ఉపాధి కోసం హైదరాబాద్ లోని మన్సూరాబాద్ డివిజన్ సప్తగిరి కాలనీలో నివాసం ఉంటూ అరబిక్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే. తన వద్దకు వచ్చిన మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
మైనర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారించి, మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితుడు మహమ్మద్ షాహబాజ్ ను దోషిగా నిర్ధారించింది, మూడేండ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.లక్ష పరిహారం అందజేసింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.