calender_icon.png 25 February, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

25-02-2025 06:40:07 PM

కళాశాల సిబ్బందిని చితకబాదిన కుటుంబ సభ్యులు..

ఉప్పర్ పల్లి వీఎమ్ఎస్ డిగ్రీ కళాశాలలో ఘటన...

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): డిగ్రీ కాలేజీ విద్యార్థినితో కళాశాల సిబ్బంది ఒకరు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పరపల్లిలోని పిల్లర్ నెంబర్ 178 సమీపంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా విఎంఎస్ డిగ్రీ కళాశాల నడుస్తుంది. ఇందులో సుధీర్ అనే వ్యక్తి సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సుధీర్ డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినితో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో సదరు యువతి తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపింది. మంగళవారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు వి ఎం ఎస్ కళాశాలకు భారీ ఎత్తున చేరుకున్నారు. కాలేజీలో ఉన్న సుధీర్ ను చితకబాదారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాలలో సంస్కారం మరిచి అసభ్యంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విఎంఎస్ కళాశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాల యాజమాన్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన సుధీర్ ను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. 

చిన్న ఘటన జరిగింది..

విద్యార్థినితో అసభ్యకరంగా వ్యవహరించిన అంశంపై విఎంఎస్ డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. అనుకోకుండా చిన్న సంఘటన జరిగిందని తెలిపారు. విషయం అంతా సద్దుమణిగిందని చెప్పడం గమనార్హం.