calender_icon.png 31 October, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్

07-07-2024 12:05:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 6 (విజయక్రాంతి): దేశంలో డాటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. 2028 నాటికి 1.7-3.6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్లు అవసరమని, ప్రస్తుతం నిర్మిస్తున్న 2.32 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్లకు ఇది అదనమని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక పేర్కొంది. 2023 చివరినాటికి భారత్‌లో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యం 977 మెగావాట్లుగా ఉంది. 2022లో ఇది 126 మెగావాట్లు ఉండగా, 2023లో సామర్థ్యం పెరిగింది.

సాటి దేశాలతో పోలిస్తే భారతీయులు అత్యధికంగా ప్రతి నెలా 19 జీబీ డాటాను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగంలో భారత్ ఇంకా వెనుకబడే ఉందని నివేదిక పేర్కొన్నారు. 2024 మధ్య కాలంలో కొత్తగా 1.03 గిగావాట్ల స్థాయిలో కోలొకేషన్ సామర్థ్యాలు జతవుతున్నాయని, ఇదే సమయంలో మరో 1.29 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆ నివేదికలో వెల్లడించారు. దీంతో 2028 నాటికి మొత్తం డాటా సెంటర్ సామర్థ్యాలు 3.29 గిగావాట్లకు చేరుతుంది. డిజిటల్, డాటా ఆధారిత సాంకేతికతల వినియోగం దన్నుతో డాటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది.

ఈ నగరాల్లోనే ఎక్కువ

కొత్తగా ఏర్పాటయ్యే డాటా సెంటర్లలో ప్రధానంగా 90 శాతం హైదరాబాద్, ముంబై, చెన్ను, ఢిల్లీ వంటి కీలక మార్కెట్లలోనే ఉండనున్నాయి. కాగా, డాటా సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ కూడా వేగంగా ఎదుగుతోంది. కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతుండటం కూడా డాటా సెంటర్ల ఏర్పాటుకు దోహదం కానుంది. ‘భారత్‌లో డాటా సెంటర్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతోంది.

కొవిడ్ అనంతరం 5 జీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ, జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సహా డిజిటల్ వినియోగం పెరగడంతో డాటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో 5 నుంచి 6.9 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్లు అవసరమని కుష్‌మన్ అండ్ వేక్‌ఫిల్డ్ ఆసియా పసిఫిక్ ఎండీ వివేక్ దహియా తన నివేదికలో తెలిపారు.