calender_icon.png 15 January, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్ కేసులు

28-07-2024 04:03:52 AM

న్యూఢిల్లీ, జూలై 27 : ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తల, మెడ భాగంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంది. భారత్‌లో ఇలాంటి కేసుల సంఖ్య 26 శాతం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా రిపోర్టును అధికారులు రిలీజ్ చేశారు. 1869 మంది క్యాన్సర్ పేషెంట్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఎన్జీవో క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ ఈ సర్వే చేపట్టింది.

మార్చి 1 నుంచి జూన్ 30 మధ్య హెల్ప్‌లైన్ నంబర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. యువకుల్లోనే ఎక్కువగా తల, మెడ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. పొగాకు వాడకం పెరగడం, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ కేసులు పెరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 90 శాతం వరకు నోటి క్యాన్సర్ రోగులు పొగాకు వాడినట్లు తేలిందన్నారు. పొగాకు వాడకాన్ని నిషేధిస్తే, చాలా వరకు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉన్నట్లు ఆశిష్ గుప్తా స్పష్టం చేశారు.