- 100 రోజుల పాలనపై టీఐబీ నివేదిక
- నివేదికలోని అంశాలను ఖండించిన యూనస్
ఢాకా, నవంబర్ 21: బంగ్లాదేశ్‌ను మాజీ ప్రధాని షేక్ హసినా వీడిన తర్వాత దేశంలో మైనార్టీలపై హింసాత్మక దాడులు పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది. మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఉన్న బంగ్లా ప్రభుత్వ 100 రోజుల పాలనపై బెర్లిన్‌లోని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ విభాగం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ (టీఐబీ) తాజాగా నివేదికను విడుదల చేసింది.
బంగ్లాలో ఆగస్ట్ 5 మధ్య 2,010 మత పరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనీ, ఈ గొడవల్లో దాదాపు 9 మంది మైనార్టీ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు నివేదిక పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇస్లామిస్ట్ శక్తులకు బంగ్లాలోని మైనారిటీ హిందువులు లక్ష్యంగా మారినట్టు తెలిపింది.
ప్రభుత్వం పడిపోయిన మూడు రోజుల్లో హిందువులపై 205 దాడులు జరిగాయనీ, దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే దుర్గా పూజలను హిందూ ప్రజలు భయం గుప్పిట్లో నిర్వహించుకున్నట్టు వెల్లడించింది. మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్న ఓ సాధువుతోపాటు మరో 18 మంది హిందువులపై బంగ్లా ప్రభుత్వం దేశ ద్రోహం కేసు పెట్టినట్టు వెల్లడించింది.
100 రోజుల పాలనలో మైనార్టీలు, అట్టడుగు వర్గాల ప్రజలు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై దాడులు జరిగినప్పటికీ వాటి కట్టడికి కఠినమై చర్యలను తీసుకోవడంలో బంగ్లా ప్రభుత్వం విఫలమైనట్టు తెలిపింది. అలాగే యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి పని చేస్తున్నట్టు నివేదిక బహిర్గతం చేసింది.
ఇటీవల అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సందర్భంగా బంగ్లాలో విజయోత్సవాలు నిర్వహించిన ప్రజలపై దాడులు చోటు చేసుకున్న విషయాన్ని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనిపై స్పందించిన యూనస్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఖండించారు.