calender_icon.png 9 October, 2024 | 6:03 AM

పెరిగిన వాణిజ్య విశ్వాసం

07-10-2024 01:00:00 AM

సీఐఐ సర్వే

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో పరిశ్రమల వాణిజ్య విశ్వాసం పెంపొందిందినట్లు సీఐఐ సర్వేలో సర్వేలో వెల్లడయ్యింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఐఐ జరిపిన తొలి సర్వేలో బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ రెండు త్రైమాసికాల గరిష్ఠస్థాయి 68.2కు చేరింది. 128వ రౌండు సీఐఐ బిజినెస్ అవుట్‌లుక్ సర్వేను 2024 సెప్టెంబర్‌లో నిర్వహించారు.

అన్ని రంగాలూ, అన్ని ప్రాంతాలకు చెందిన 200 కంపెనీలకుపైగా ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంతర్జాతీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగవంతమయ్యిందని సీఐఐ తెలిపింది. రానున్న పండుగ సీజన్ వృద్ధి అవకాశాల్ని మరింత పటిష్ఠం చేస్తుందన్న ఆశాభావాన్ని పరిశ్రమల సమాఖ్య వ్యక్తం చేసింది.

అయితే అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగనున్నందున, ఆర్థికాభివృద్ధికి విఘాతం ఏర్పడవచ్చని హెచ్చరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ కమోడిటీ ధరల పెరుగుదల, అంతర్జాతీయ డిమాండ్ మందగించడం ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. 

పెరుగుతున్న గ్రామీణ డిమాండ్

దేశంలో వినియోగం మెరుగుపడుతున్నదని, రుతుపవనాల ప్రగతి కారణంగా గ్రామీణ డిమాండ్ పుంజుకుంటున్నదని సర్వేలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారని, సంస్కరణల కొనసాగింపు, ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిని పెంచుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారని సీఐఐ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో గత 6 నెలలతో పోలిస్తే ప్రైవేటు మూలధన పెట్టుబడుల్లో మెరుగుదల ఉంటుందని సర్వేలో 59 శాతం మంది అంచనా వేశారు. ఎన్నికల నేపథ్యంలో తొలి త్రైమాసికంలో తగ్గిన ప్రభుత్వ మూలధన పెట్టుబడులు ద్వితీయ త్రైమాసికం నుంచి పెరుగుతాయని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న 34 శాతం మంది రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్ల కోతను క్యూ3లో (అక్టోబర్ ప్రారంభిస్తుందని అంచనా వేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇటీవల మిగులు లిక్విడిటీ ఏర్పడినందున, అక్టోబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ కొంతశాతం రేట్లు తగ్గించడం లేదా తన వైఖరిని కఠినం నుంచి సరళానికి మార్చడం చేయవచ్చని సర్వేలో అంచనా వేసినట్లు సీఐఐ వివరించింది

. వాణిజ్య అవకాశాలు మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో వివిధ రంగాల్లో ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని మెజారిటీ ప్రతినిధులు అంచనా వేశారు.