calender_icon.png 22 September, 2024 | 1:22 PM

పెరిగిన రాష్ట్ర ప్రభుత్వ వ్యయం

22-09-2024 12:44:52 AM

గతేడాది కంటే 3 శాతం ఎక్కువ ఖర్చు

కాగ్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జులై మధ్యకాలంలో ప్రభుత్వ వ్యయం పెరిగినట్లు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చుకంటే కాంగ్రెస్ సర్కా ర్ 3 శాతం ఎక్కువ ఖర్చు పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయాన్ని ప్రభుత్వం రూ.2.11లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో ఏప్రిల్ మధ్య కాలంలో 23.76 శాతం మాత్రమే సర్కార్ ఖర్చు చేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయాన్ని ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లుగా అంచనా వేయగా, మొదటి నాలుగు నెలల్లో రూ.59,041.19 కోట్లను ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 26.72 శాతం కావడం గమనార్హం.

గతేడాది కంటే ఈ ఏడాది పెన్షన్లకిచ్చే సొమ్ము భారీ పెరిగింది. గతేడాది పెన్షన్ల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.13,024.07 కోట్లను అంచనా వేసింది. ఇందులో ఏప్రిల్ మధ్య కాలంలో రూ.5461.89 కోట్లు ఖర్చు చేసింది. ఇది బడ్జెట్ అంచనా ల్లో 41.94శాతం. ఈ ఏడాది ప్రభుత్వం రూ. 5741.72 కోట్లను ఖర్చు చేసింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 49.32 శాతం కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే దాదాపు 8 శాతం పెరిగింది. ఇదే సమయంలో వడ్డీలకు కూడా ప్రభుత్వం ఈ ఏడాది భారీగా ఖర్చుచేసింది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో 32.02 శాతం చెల్లించగా, ఈ ప్రభుత్వం ఈ సారి ఏకంగా 46.21శాతం కేటాయించింది. జీతాలు, సబ్సిడీలకు చెల్లించే సొమ్ము విషయంలో గతేడాదితో పోలిస్తే పెద్దగా మార్పు లేదని కాగ్ నివేదిక వెల్లడించింది.

తగ్గిన క్యాపిటల్ వ్యయం

అభివృద్ధి, రక్షణకు సంబంధించిన వ్యయంతో పాటు రాష్ట్రానికి కేంద్రమిచ్చే రుణాలను కూడా మూలధన వ్యయంగా పరిగణిస్తారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ -జులై నెలల్లో క్యాపిటల్ వ్యయం భారీగా తగ్గింది. గతేడాది బడ్జెట్ అంచనా రూ.37,524.70 కోట్లు కాగా.. ప్రభుత్వం రూ.13304.14 కోట్లు ఖర్చు చేసింది. ఇది బడ్జెట్‌లో 35.45 శాతం. ఈ సారి బడ్జెట్‌లో క్యాపిటల్ వ్యయం అంచ నా రూ. 33486.50 కోట్లు కాగా.. ప్రభు త్వం రూ.7625.34 కోట్లు ఖర్చు చేసింది. ఇది కేవలం 22.77 శాతం మాత్రమే.