calender_icon.png 27 October, 2024 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన విదేశీ మారక నిల్వలు

29-06-2024 12:51:11 AM

ముంబై, జూన్ 28: గత సమీక్షావారంలో రికార్డుస్థాయి నుంచి దిగివచ్చిన విదేశీ మారక నిల్వలు జూన్ 21తో ముగిసినవారంలో స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 21తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 816 మిలియన్ డాలర్ల మేర పెరిగి 653.71 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ తొలివారంలో 655.817 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయిని చేరిన ఈ నిల్వలు అటుతర్వాత  జూన్ 14తో ముగిసిన వారంలో 2.992 బిలియన్ డాలర్ల మేర తగ్గి 652.895 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.

తాజాగా జూన్ 21తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 106 మిలియన్ డాలర్లు తగ్గి 574.134 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ పెరిగాయ్ 

దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  988 మిలియన్ డాలర్లు పెరిగి 56.956 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ప్రధానంగా బంగారం నిల్వలు అధికంకావడమే మొత్తంగా విదేశీ మారక నిల్వలు పెరగడానికి కారణం.  స్పెషల్ డ్రా యింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 57 మిలియన్ డాలర్లు క్షీణించి 18.049 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజ ర్వులు మాత్రం 9 మిలియన్ డాలర్లు  తగ్గి 4.572 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.