* గతేడాదితో పోలిస్తే 122 శాతం పెరుగుదల
* టాప్‌లో మనీలాండరింగ్, ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్
* గతేడాది నమోదైన కేసులు 22859, ఈ ఏడాది 37,689 కేసులు
* వార్షిక నివేదికను విడుదల చేసిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు బారీగా పెరియి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో మొత్తం 11,914 సైబర్ కేసులు నమోదు కాగా, సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.7,93,18,94,102 కోట్లు కొల్లగొట్టారు. వాటిల్లో బాధితులకు కేవలం రూ. 71.28 కోట్లు వరకు రీఫండ్ అందించారు పోలీసులు. మొత్తంగా ఈ ఏడాదిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ 65 శాతం పెరిగింది.
మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో 2024లో నమోదైన కేసుల వివరాలతో కూడిన వార్షిక నివేదికను సీపీ అవినాష్ మహంతి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో మొత్తం 37,689 కేసులు నమోదు చేశామని అన్నారు. గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య 65శాతం పెరిగిందని.. ప్రతి ఫిర్యాదుదారుడి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్ చేయడమే దీనికి కారణమన్నారు.
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామన్నారు. ఈ సంవత్సరం సైబర్ క్రైమ్, ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ)పై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ గణనీయంగా 122 శాతం పెరిగిందన్నారు. డిజిటల్ క్రైమ్ కూడా బాగా పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది బాధితులు కోల్పోయిన/దొంగలించబడిన సుమారు 8 వేల సెల్‌ఫోన్లు రికవరీ చేసి వారికి తిరిగిచ్చామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో పబ్స్, ఫాంహౌస్‌లు అధికంగా ఉండటం.. పోలీ సుల నిరంతర తనిఖీలతో ఈ ఏడాది నార్కోటిక్స్ కేసులు కూడా పెరిగాయన్నారు. కానీ, గతంలో పట్టుబడినవిధంగా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడలేదని.. చిన్న క్వాంటిటీలో సరఫరా చేయడం పెరిగిందన్నారు. మొత్తం ఎన్‌డీపీఎస్ యాక్ట్ 421 కేసులు నమోదు చేసి రూ. 2,492 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఎన్‌డీపీఎస్ కేసుల్లో మొత్తం 954 మందిని అరెస్ట్ చేశామన్నారు.
ట్రాఫిక్ చలాన్స్‌లో రికార్డు..
ట్రాఫిక్ చలాన్స్‌లో సైబరాబాద్ కమిషనరేట్ రికార్డు కొట్టింది. చలాన్స్ ద్వారా రూ.11,181 కోట్లు వసూలు చేసినట్లు సీపీ వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కొన్ని బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలో నిర్వహించే ఈవెంట్స్ పర్మిషన్ కోసం పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తీసుకొచ్చామని సీపీ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 805 రోడ్డు ప్రమాదాలలో 842 మంది మృతిచెందారని తెలిపారు. అలాగే ఎకనామిక్ వింగ్‌కు సంబంధించి 90 కేసులలో రూ.529 కోట్ల ప్రాపర్టీ అటాచ్ చేశామని తెలిపారు. దీంతో పాటు 541 షీటీం కేసులు నమోదు అయ్యాయని సీపీ వెల్లడించారు.
జనవరి 1 నుంచి కొత్త విధానం..
సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఇప్పటివరకు లోకల్ పోలీస్ స్టేషన్లలో రూ.లక్ష వరకు కోల్పోయిన బాధితులు కేసులు నమోదు చేసేవారని, ఇకపై జనవరి 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.1.50లక్షల వరకు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశామని సీపీ అన్నారు. రూ. 1.50 లక్షలు దాటితేనే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. బీఎన్‌ఎస్ యాక్ట్ ఫస్ట్ ఎఫ్‌ఐఆర్ రాజేంద్రనగర్‌లో నమోదు అయ్యిందని గుర్తుచేశారు. బీఎన్‌ఎస్/బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ వచ్చాక మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 14,250 కేసులు నమోదు అయినట్లు సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.