- గతేడాదితో పోలిస్తే 41శాతం పెరుగుదల
- ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసిన పండుగలు
- బౌన్సర్లు మితిమీరి ప్రవర్తిస్తే కేసులు నమోదు
- 2023 వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గతేడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఈ ఏఏడాది క్రైమ్ రేట్ పెరిగింది. ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులు, చోరీలు, సైబర్ నేరాలు, స్నాచింగ్స్ పెరిగాయి. 2023లో మొత్తం 25,488 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 35,944 కేసులు నమోదయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే 41 శాతం ఎక్కువగా నమోదైంది.
సిటీ కమిషనరేట్‌లోని ఐదు జోన్ల పరిధిలో ఈ యేడాది నమోదైన కేసులు, క్రైమ్ రేట్ వివరాలతో కూడిన 2024 వార్షిక నివేదికను ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ విక్రమ్ సింగ్‌మాన్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్, డీసీపీలు, ఐటీ సెల్ అధికారులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నగరంలో నిర్వహించిన పండగలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఉండటంతో ఈ ఏడాది నగరంలో క్రైమ్‌రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు. ఇంతకు ముందు డయల్ 100కి కాల్‌చేస్తే 10 నిమిషాల సమయం పడుతుంటే, కానీ ఇప్పుడు కేవలం 7 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది మొత్తం సైబర్ క్రైమ్ నేరాలలో ఈ ఏడాది 4,042 కేసులు నమోదు కాగా, మొత్తం రూ. 300 కోట్ల వరకు బాధితులు డబ్బు కోల్పోయారు. సైబర్ నేరాలకు పాల్పడిన 520 మందిని అరెస్ట్ చేసి, బాధితులకు రూ. 42 కోట్లు రీఫండ్ అందించాం. ఈ ఏడాది మొత్తం 30 మంది పోలీసులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కి సస్పెండైనట్లు తెలిపారు.
డ్రగ్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం..
నగరంలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై ఈ ఏడాది 322 కేసులు నమోదు చేసి.. మొత్తం రూ. 13.5 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశామన్నారు. ఇద్దరు విదేశీయులు, 58 డ్రగ్ పెడ్లర్లతో పాటు 56 మంది వినియోగదారులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు.
గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 48,53,018 నమోదు కాగా, ఈ ఏడాది 48,81,352 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ అడిషనల్ సీపీ పీ విశ్వప్రసాద్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ విధుల్లోకి ౩౯ మంది ట్రాన్స్‌జెండర్లు వస్తున్నారని.. వీరికి శిక్షణ అందించామని, సోమవారం నుంచి ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
తగ్గిన రియల్ ఎస్టేట్ మోసాలు
నగరంలో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ మోసాలు తగ్గాయని డీడీ డీసీపీ శ్వేత తెలిపారు. గతంలో నమోదైన భువన్‌తేజ, ధన్వంతరి రియల్ మోసాలపై విచారణ స్పీడప్ చేశామని, వాటికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు రియల్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మని వివరించారు. ఈ ఏడాది మొత్తం 248 కేసులు నమోదు కాగా, వాటిలో కోల్పోయిన డబ్బు రూ. 1,036 కోట్లుగా ఉందని డీసీపీ తెలిపారు.
నగరంలోని వ్యాపారులు, ప్రజలు దుకాణాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సీపీ కోరారు. ఈ మధ్య కాలంలో బౌన్సర్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను సైతం నెట్టివేస్తున్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోమని సీపీ స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే బౌన్సర్ ఏజెన్సీలతో పాటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్న వీఐపీ, వీవీఐపీలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.