ప్రైవేటు కంపెనీల చార్జీల పెంపు ఎఫెక్ట్
న్యూఢిల్లీ, జూలై 18: ఇటీవల ప్రైవేటు టెలికాం కంపెనీలు మొబైల్ చార్జీలను భారీగా పెంచడంతో ప్రభుత్వ రంగ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) లాభపడుతున్నది. అల్పాదాయ వర్గాలవారితో పాటు పలువురు ప్రిపెయిడ్ చందాదారులు బీఎస్ ఎన్‌ఎల్‌వైపు మళ్లుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించిన సమాచారం ప్రకారం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల చార్జీల పెంపు అమలులోకి వచ్చిన జూలై 3,4 తేదీల నుంచి ప్రభుత్వ సంస్థలోకి 2,50,000 మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ద్వారా తరలివచ్చారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికీ తక్కువస్థాయిలోనే మొబైల్ చార్జీలను ఆఫర్ చేస్తున్నందున మరింతమంది కొత్త చందాదారులు వస్తారని సంస్థ అధికారి ఒకరు చెప్పారు. ప్రైవేటు కంపెనీలు 11 శాతం మేర చార్జీలను పెంచగా, బీఎస్‌ఎన్‌ఎల్ టారీఫ్‌లను ఏ మాత్రం మార్పు చేయలేదు. ఉదాహరణకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఎయిర్‌టెల్ కనిష్ఠ ప్లాన్ ధర రూ.199కే చేరగా, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోల కనిష్ఠ ప్లాన్ ధర రూ.189 నుంచి మొదలవుతున్నది. ఇదేతరహా ప్రయోజనాల్ని అందించే బీఎస్‌ఎన్‌ఎల ప్లాన్ టారీఫ్ రూ.108 మాత్రమే. ఈ సంస్థ రూ.107 మధ్య శ్రేణిలో పలు మంథ్లీ ప్లాన్స్‌ను అందిస్తున్నది.