20-03-2025 02:21:13 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. గతేడాది బడ్జెట్‌లో వైద్యానికి రూ.11,468 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.12,393 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే రూ.925 కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. 2023-24తో పోలిస్తే 2024-25 లో రూ.693 కోట్లు తక్కువగా కేటాయించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వైద్యానికి కేటాయింపులు పెరగడం విశేషం. అయితే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి ఉన్న రూ.5 లక్షల పరిమితిని కాంగ్రెస్ సర్కారు రూ.10 లక్షలకు పెంచడమే కాకుండా ఇందులో కొత్తగా 65 ఆరోగ్య సమస్యలకు చికిత్సలను కూడా ప్రవేశపెట్టింది. దీంతోపాటు గతంలో ఉన్న 1,375 విధానాలకు ప్యాకేజీలను పెంచారు.
ఫలితంగా రాజీవ్ ఆరోగ్య శ్రీపై అదనంగా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. మరోవైపు రాష్ట్రంలో 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు నగరంలో 3 టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల పనులు జరుగుతున్నాయి.
ఏటికేడు వైద్యంపై ఖర్చులు పెరుగుతున్నాయి. కొత్తకొత్త రోగాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వైద్యానికి కేటాయింపులు పెరగడాన్ని వైద్యులు స్వాగతిస్తున్నారు. అయితే కేటాయింపులు ఇంకాస్త పెంచాల్సి ఉండిందని అంటున్నారు.