11-04-2025 12:31:05 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 10: మున్సిపాలిటి పరిధిలో జనాభా అనుగుణంగా కృష్ణ నీటి సరఫరాను పెంచాలనిఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి రాగన్నగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భముగా పలువురు నీటి సమస్య, పారిశుధ్య సమస్యతో పాటుగా పలు శాఖల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా కొహెడలో మంచినీటి సమస్య అధికంగా ఉందని వెంటనే పరిష్కరించాలని కొహెడ వాసులు ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటి పరిధిలోని ప్రతి కాలనీలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా రాజీవ్ గృహకల్ప కాలనీలో కబ్జాదారులు తిరుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని రాజీవ్ గృహకల్ప లబ్ధిదారుల సమాచారం పూర్తిగా సేకరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల తాహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.