calender_icon.png 28 October, 2024 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడెక్షన్ పెంపు?

27-06-2024 01:57:59 AM

న్యూఢిల్లీ, జూన్ 26: వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్న 2024 బడ్జెట్లో మధ్యతరగతికి పన్ను భారాన్ని తగ్గించే ప్రతిపాదన చేస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2023 బడ్జెటో న్యూ ట్యాక్స్ రిజీమ్‌లో వేతనాలు అందుకునే, పెన్షన్లు తీసుకునే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.50,000 స్టాండర్డ్ డిడెక్షన్‌ను ప్రవేశపెట్టారు.

అయితే ఈ స్టాండర్డ్ డిడెక్షన్ ఒక ఆటోమ్యాటిక్ చాయిస్. పన్ను చెల్లింపుదారులు దానిని తీసుకుంటేనే వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడెక్షన్ పరిమితిని పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నదని సమాచారం. కానీ పాత పన్ను విధానంలో ఇప్పటికే మినహాయింపులు అధికంగా ఉన్నందున, స్టాండర్డ్ డిడెక్షన్ యథాతథంగా రూ.50,000 వద్దనే అట్టిపెడతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మూలధన లాభాల వ్యవస్థ యథాతథం?

మూలధన లాభాలపై పన్నులు, శ్లాబులు, కాలపరిమితి అంశాల్లో ప్రధాన మార్పులేవీ చేసే అవకాశం లేదని అంటున్నారు. మూలధన లాభాలకు సంబంధించి వివిధ ఆస్తులను అట్టిపెట్టుకునే కాలపరిమితుల్లో మార్పులు చేయాలంటూ సిఫార్సులు వస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు చెపుతున్నారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఖర్చుల సాక్ష్యాలు లేకుండా వారి పన్ను ఆదాయం నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించుకునే అవకాశాన్ని స్టాండర్డ్ డిడెక్షన్ కల్పిస్తుంది. ప్రస్తుతం రెండు పన్ను విధానాల్లోనూ ఈ పరిమితి రూ. 50,000గా ఉన్నది.