calender_icon.png 27 September, 2024 | 3:02 PM

కనీస వేతన రేట్ల పెంపు

27-09-2024 12:55:30 AM

అసంఘటిత కార్మికులకు చేకూరనున్న లబ్ధి

అక్టోబర్ 1 నుంచి అమలులోకి కొత్త రేట్లు 

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్సులో సవరణలు చేస్తూ కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య కార్మికులకు ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఆర్థిక ఉపశమనం కల్పించనుంది. భవన నిర్మాణం, హమాలీ, హౌస్‌కీపింగ్, మైనింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో పనిచేసే కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా వేతన రేట్లను సవరించారు. 

ఏటా రెండుసార్లు 

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రేట్లు రోజుకు రూ.783 (నెలకు రూ.20,358), సెమీ స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.868 (నెలకు రూ.22,568), నైపుణ్యం కలిగిన వారికి రూ.954 (నెలకు రూ.24,804), అత్యంత నైపుణ్యం కలిగినవారికి రూ.1,035 (నెలకు రూ.26,910)కు పెంచింది. వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం ధరల సూచికలో పెరుగుదల ఆధారంగా ఏటా రెండు సార్లు (ఏప్రిల్ 1, అక్టోబర్ 1)సవరిస్తుంది. ఇదిలా ఉండగా పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 2.15 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే నెలలో 7.54 శాతంగా ఉంది. 2023 జూన్‌లో 5.57 శాతం ఉండగా ఈ ఏడాది జూన్‌లో వార్షిక ద్రవ్యోల్బణం 3.67 శాతంగా ఉంది.