calender_icon.png 12 March, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల ధరల పెంపు!

17-05-2024 01:04:50 AM

స్టాంపుడ్యూటీ సవరణపైనా అధ్యయనం

ఆదాయం పెంచేందుకు రెవెన్యూ సంస్కరణలు

ఇకపై ప్రతి నెలా రాబడి పెంపుపై ఫోకస్ 

జీఎస్టీ ఎగవేతదారులను ఉపేక్షించేది లేదు

మద్యం అమ్మకాలు పెరిగినా ఆదాయమేది?

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

* ఆదాయం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. అందుకోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలి.  

సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 1౬ (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం భూముల ధరలను సవరించబోతున్నట్టు తెలిసింది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపైనా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయా శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సంకేతాలిచ్చారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఉన్న అన్ని అవకాశాలను అణ్వేషించాలని, అందు లో భాగంగా భూముల ధరలను పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం లో అన్ని చోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగినా.. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని సీఎం అభిప్రాయపడ్డారు. చాలాచోట్ల భూములకు ప్రభుత్వం నిర్ణయించిన విలువకు, మార్కెట్ విలువకు పొంతన లేకపోవ టమే అందుకు కారణమని అధికారులు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలాచోట్ల భూముల ప్రభుత్వ ధరలకు, మార్కెట్ విలువకు భారీ తేడా ఉంది.

నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల ధరలను సవరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు.. తదితర వాటిలో వేటికి ఎంత నిర్ణయించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సూచించారు. రాష్ట్ర రాబడి పెంపుతోపాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు భూముల ధరల సవరణ జరగాలని పేర్కొన్నారు. 

స్టాంపుడ్యూటీ పెంపుపై అధ్యయనం

స్టాంపుడ్యూటీ పెంపుపైనా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనదగ్గర స్టాంపుడ్యూటీ ఎంత ఉంది? తగ్గించాలా? పెంచాలా? అనేది కూడా అధ్యయనం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని తెలిపారు. చాలాచోట్ల రిజిస్ట్రార్ ఆఫీసులు అద్దె భవనాల్లో ఉన్నాయని, వసతులు లేక రిజిస్ట్రేషన్లకు వచ్చేవాళ్లు చెట్లకింద నిలబడుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ వినియోగం కోసం ఇప్పటికే సేకరించిన భూములను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని సీఎం సూచించారు. సామాన్యులకు, చిన్నచిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని స్పష్టంచేశారు.

ఆదాయం పెంచాల్సిందే

ఆదాయం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అందుకోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకపై ప్రతినెలా ఆదాయ పెంపును సమీక్షించు కోవాలని అధికారులకు సూచించారు. బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకు ఆ నెల లక్ష్యాన్ని నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని స్పష్టంచేశారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు పక్కాగా క్షేత్రస్థాయి తనిఖీలు, ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని సూచించారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.