calender_icon.png 11 January, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ చార్జీలు పెంచితే సహించం

22-10-2024 02:20:58 AM

  1. ఫిక్స్‌డ్ చార్జీల పెంపు విరమించుకోవాలి
  2. 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటాం
  3. పరిశ్రమలన్నీ ఒకే టారిఫ్ కిందనా?
  4. డిస్కంల ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి
  5. ఈఆర్సీని కోరిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపితే సహించేది లేదని ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వినియోగదారులపై రూ. 18,500 కోట్ట భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇంత భారీగా  భారం మోపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆనాలోచి నిర్ణయాలతో వ్యవసాయ రంగం నుంచి పారిశ్రా మిక రంగం వరకు అన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం విద్యుత్ చార్జీల పెం చాలంటూ డిస్కంలు చేసిన ప్రతిపాదనలను విరమించుకోవాలని ఎలక్ట్రిసిటి రెగ్యులేషన్ కమిటీ చైర్మన్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాజీ  మంత్రి జగదీశ్‌రెడ్డి కలిసి మాట్లాడుతూ  రేవంత్ ప్రభుత్వం విద్యుత్‌ను వ్యాపారం వస్తువుగా చూస్తోందన్నారు. గృహా విద్యుత్‌కు సంబంధించి నెలకు రూ. 300 యూనిట్లు దాటితే ఫిక్స్ చార్జీలు రూ. 10 నుంచి రూ. 50 వరకు పెంచాలని ప్రతిపాదనలు చేసిందని ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన అని, ఈ నిర్ణయం  ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుందన్నారు.

పరిశ్రమలను ఒకే  కేటగిరి కిందికి తీసుకు రావడం అసంబద్ధమైన ఆలోచన, దీంతో చిన్న పరిశ్రమలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఒకే టారిఫ్ చేసే విధంగా చేస్తే రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని, ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగమనంలో  ఉందన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో ఫాక్స్‌కాన్ సంస్థ మొదట దశను విస్తరించగా, రెండో దశకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రాకు తరలి వెళ్లుతున్నట్లు ప్రచారం జరుగుతుందని, తెలంగాణలో ఏర్పాటు చేసే విషయం ఎక్కడా చెప్పడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలనే విషయంపై కూడా రేవంత్ ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదని, మౌనంగా ఉండటం చూస్తే మోదీకి తలొగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు డిస్కింలు చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేశాయని, ట్రూ ఆప్ చార్జీలు రూ. 1200 కోట్లు కావాలంటే  తాము భరిస్తామని ప్రజలు మీద భారం వేయబోమని కేసీఆర్ తేల్చి చెప్పారన్నారు.

సిరిసిల్లలో పవర్‌లూమ్ పరిశ్రమ, కాటేదాన్‌లో పరిశమ్ర లకు 50 శాతం సబ్సిడీతో ఇచ్చామని, త్వరలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈ పరిశ్రమలకు సబ్సిడీ లేకుండా పోతుందని  చెప్పారు. ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతామంటే అంగీకరిం చవద్దని ఈఆర్సీ చైర్మన్‌ను కోరినట్లు తెలిపారు.

ఈనెల 23న ప్రజాభిప్రాయ సేకరణ పాల్గొనాలని చైర్మన్ సూచించారని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ముందే ఈవిషయం ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నట్లు వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ హియరింగ్ వెళ్లి ప్రజల తరుపున తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు.

గ్రూప్స్ అభ్యర్థులకు అండగా ఉంటాం

 జీవో నెం. 29తో తాము నష్టపోతామని గ్రూప్స్ అభ్యర్థులు ప్రభుత్వానికి కోరితే మొండిగా వ్యవహరిస్తుందని, వారికి అన్యా యం జరిగే విధంగా పరీక్షలు నిర్వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో కేసు వేశామని, శుక్రవారమే విచారణ జరుగుతుందని భావిస్తే, కానీ సోమవారం విచారణకు తీసుకున్నారని తెలిపారు.

సుప్రీంకోర్టు తాము లేవనెత్తిన ఏ అంశాన్ని వ్యతిరేకించలేదన్నారు. ఈ జీవోపై తీర్పు వచ్చే వరకు ఫలితాలు ఇవ్వవద్దని తెలిపిందని, అదే విధంగా పిటిషన్‌ను వేగంగా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. జీవో 29 అనేది ఓపెన్ కోటాను కూడా రిజర్వ్ చేసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్స్ రాసే అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది..

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనుహ్యమైన ఘనతను సాధించిందని ఎద్దే వా చేశారు. సోమవారం ఎక్స్‌వేదికగా స్పం దిస్తూ  రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకరావడంతో ఫలితాలు కూడా బు ల్డోజర్ ఎకానమీ తరహాలో వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయని, వసూళ్లలో రాష్ట్రం ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధ సాధించలేదన్నారు. యూపీ ఆర్థిక వ్యవస్థతో మన రాష్ట్రం  పోటీపడుతోందన్నారు. అబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలిస్తోందన్నారు. 

అభివృద్ది చెందుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరమన్నారు. ఈ తిరోగమన పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

రెక్కల చప్పుడే మిగిలింది

రైతు బంధు కావాల్లో, రాబందు కావాల్లో ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ఇచ్చిన నినాదం నిజమైందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ఎగిరిపోయిందని, రాబంధుల రెక్కల చప్పుడే రైతులకు మిగిలిందన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుగా అన్నదాతల పరిస్థితి ఉందన్నారు.

ఎకరానికి రూ. 15వేలు ఇస్తామని ఊదరగొట్టి, బీఆర్‌ఎస్ ఇచ్చే రూ. 10వేల పెట్టుబడి సాయం ఊడగొట్టారని మండిపడ్డారు. పంట పెట్టుబడి ఎగొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని అన్నారు. రైతు ద్రోహి కాంగ్రెస్ చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని, ఇప్పుడు మరొక రుజువు బయటపడిందన్నారు.