హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14 నుంచి సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను 40 శాతం పెరగనున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్సిఓలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రెసిడెన్షియల్ గురుకులాలు, హాస్టల్ లలో 40 శాతం డైట్, కాస్మోటిక్ చార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 14న విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలలోని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయాలన్నారు. అందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానాలు పంపాలన్నారు.