19-02-2025 01:41:59 AM
*డిప్యూటీ సీఎం భట్టికి ప్రతిపాదనలు అందజేసిన విద్యా కమిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): రాబోయే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో విద్యాశాఖకు 10 శాతం నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కను తెలంగాణ విద్యా కమిషన్ కోరింది. ఈ మేరకు పలు సిఫార్సులు చేస్తూ నివేదికను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చారుకొండ వెంకటేశ్, జ్యోత్స్నశివారెడ్డి అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించి ఆ వివరాలను డిప్యూటీ సీఎంకు సమర్పించినట్లు వెల్లడించారు.
మధ్యాహ్న భోజనం పథకానికి నిధులు పెంచాలని, ప్రస్తుతం ఉన్న పాఠశాలలను తెలంగాణ ఫౌండేషనల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్టు కమిషన్ తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలు, ఉత్తమ అభ్యాస బోధన పద్ధతులను అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.