ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ వారు ఎక్స్‌ప్రెస్ బస్సులను పెంచాలి. ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపడం వల్ల తక్కువ స్టాప్‌లలో ఆపుతారు కాబట్టి అత్యవసర పనులపై వెళ్లే వారు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలవుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నందున వారు ఆర్డినరీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. వాళ్లు ఎక్కువ మంది ఎక్కడం వల్ల ప్రతిస్టేజిలోనూ ఆపాల్సి వస్తోంది. దీనివల్ల చాలా కాలయాపన జరుగుతోంది. వివిధ పనుల నిమిత్తం అర్జెంటుగా వెళ్లాలనుకునే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్కోసారి ఓవర్‌లోడ్ వల్ల మధ్యలోనే బస్సులు ఆగిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ వారు ఎక్స్‌ప్రెస్ బస్సులను అధికంగా నడపడానికి చర్యలు తీసుకుంటే ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణికులు అవస్థలు కూడా కొంత మేరకు తగ్గుతాయి. తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్