calender_icon.png 20 September, 2024 | 8:31 AM

కరెంట్ ఛార్జీలు పెంచండి

20-09-2024 01:23:07 AM

1200 కోట్ల ఆదాయం కోసం విద్యుత్తు ఛార్జీల పెంపు!

ఈఆర్‌సీకి వార్షిక ఆదాయ అంచనాలను ప్రతిపాదించిన డిస్కంలు

2024-25 సంవత్సరానికి ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు

హైటెన్షన్ క్యాటగిరీలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రతిపాదన

ఎల్టీ క్యాటగిరీలో లోడ్ సామర్థ్యం ఆధారంగా ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపు

 హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచాలని ఈఆర్‌సీని డిస్కంలు కోరాయి.ఎల్టీ, హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీలోని వినియోగ దారులపై విద్యుత్తు భారం మోపుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి రాష్ట్రంలోని ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ రెండు డిస్కంలు తమ ప్రతిపాదనలను అందించాయి. 2024 బ్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏఆర్‌ఆర్ (వార్షిక ఆదాయ అవసరాల నివేదిక) ను బుధవారం రాత్రి రెండు డిస్కంలు ఈఆర్‌సీకి ప్రతిపాదనలను పంపించాయి.

ఈ ప్రతిపాదనలో పేర్కొన్న ప్రకారం 2024-25లో మొత్తం రూ. 14,222 కోట్ల ఆదాయం లోటును డిస్కంలు చూపించాయి. అయితే ఇందులో రూ. 1200 కోట్ల ఆదాయాన్ని పెంచుకునేలా ఈఆర్‌సీ అనుమతించాలని ఆ ప్రతిపాదనల్లో డిస్కంలు అభ్యర్థించాయి. మిగిలిన లోటు రూ. 13,022 కోట్లను ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీల రూపంలో భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించినది రూ. 8,093 కోట్లు, ఎన్‌పీడీసీఎల్‌కు సంబంధించినవి రూ. 4,929 కోట్లు ఉన్నాయి. 

300 యూనిట్లు దాటితేనే..

రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు పూర్తి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఈ నేపథ్యంలో డిస్కంలు ఈఆర్‌సీకి పంపించిన ఏఆర్‌ఆర్‌లో 300 యూనిట్లు దాటే వినియోగదారులపై ఫిక్స్‌డ్ చార్జీల రూపంలో భారం మోపాయి. దీనికి కూడా లోడ్ సామర్థ్యం ఆధారంగా కిలో వాట్‌కు రూ. 10 ఫిక్స్‌డ్ చార్జీలను రూ. 50కి పెంచుతూ ప్రతిపాదించాయి. అలాగే ఎల్టీ కేటగిరిలో ఉన్న ఇతర వినియోగదారులకు సంబంధించినకూడా ఫిక్స్‌డ్ చార్జీల పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదన చేశాయి. ఇలా సుమారు రూ. 5 వందల కోట్ల వరకు ఆదాయాన్ని పెంచేలా ప్రతిపాదనలు ఉన్నాయి.

హెచ్‌టీపై భారం..

లోటులో రూ. 1,200 కోట్ల భారాన్ని తగ్గించుకునేలా డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో అత్యధికంగా హెచ్‌టీ వినియోగదారులపైనే భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పరిశ్రమలు, పౌల్ట్రీ, ఫెర్రో అల్లాయ్ యూనిట్లపై కొంత భారం వేసేలా ప్రతిపాదించారు. ఇందులో 11 కేవీ వినియోగదారులపై ఏమీ పెంచకుండా యథాతథంగా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే 33 కేవీ వినియోగదారులకు సంబంధించి ఇప్పటివరకు యూనిట్‌కు రూ. 715 పైసలు వసూలు చేస్తుండగా.. ఇకపై రూ. 7.65 పైసలకు పెంచారు.

అలాగే 132 కేవీ వినియోగదారులకు ప్రస్తుతం రూ. 6.65 పైసలకు యూనిట్ అందిస్తుండగా.. ఇకపై రూ. 7.65 పైసలకు పెంచారు. ఇక సీజనల్ పరిశ్రమకు సంబంధించి.. 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ వినియోగదారులందరికీ ఇకపై యూనిట్‌ను రూ. 8.60 పైసలకు అందిస్తారు. హెచ్‌టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు (11 కేవీ, 33 కేవీ, 132 కేవీ) అందరికీ యూనిట్‌ను రూ. 8.80 పైసల ఛార్జీ వసూలు చేస్తారు. ఇక విమానాశ్రయాలు రైల్వే, బస్ స్టేషన్లకు అన్ని కేటగిరీల్లోని వినియోగదారుల నుంచి రూ. 8.50 పైసల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.

దీనితోపాటు హెచ్‌టీలో ఉన్న తాత్కాలిక వినియోగదారుల నుంచి ఇకపై రూ. 11.80 పైసల చొప్పున యూనిట్‌కు వసూలు చేసేలా డిస్కంలు ప్రతిపాదనలను ఈఆర్‌సీకి సమర్పించాయి. ఇప్పటి వరకు 11 కేవీ, 33 కేవీ, 132 కేవీల వినియోగదారులకు వేర్వేరుగా ఉన్న ఛార్జీలను ఇప్పుడు కేటగిరీల వారీగా సమానం చేస్తూ ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. దీనితో సుమారు రూ. 700 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వచ్చిన ప్రతిపాదనలపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేసి అనుమతి ఇస్తుంది. ఈఆర్‌సీ నుంచి వచ్చే అనుమతులతో నవంబర్  నుంచి ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.