calender_icon.png 28 November, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూకుడు పెంచండి

28-11-2024 03:03:44 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత

  1. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం
  2. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కష్టపడండి
  3. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

హైదరాబాద్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీకి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని.. అదే సమయంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని తనను కలిసిన తెలంగాణ నేతలతో అన్నట్టు సమాచారం.

తెలంగాణలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని.. కావాల్సిందంతా నేతల్లో చిత్తశుద్ధి మాత్రమేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. బుధవారం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు సాధించిన బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం పెద్ద విషయం కాబోదని.. ఆ దిశగా కష్టపడి పనిచేయాలని.. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే సమాచారం తమకుందని ప్రధాని అన్నట్లుగా తెలుస్తోంది.

నేతలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారని సమాచారం. తెలంగాణ ఎంపీలంతా ప్రధానితో సమావేశం అయ్యేందుకు విజ్ఞప్తి చేయగా బుధవారం అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ర్టంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని ప్రధానమంత్రి వాకబు చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ప్రధాని సూచించారు. ప్రజాసమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని.. అప్పుడే నాయకులకు, పార్టీకి ఎదుగుదల ఉంటుందని సూచించారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్ రెడ్డి కుమార్తె వివాహ పనులున్నందున ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

పార్టీ పరిస్థితిపై ప్రధాని వద్ద నివేదిక

బుధవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం నేతలంతా ఐక్యంగా పనిచేయాలనే అంశంపై ఆయన స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి జనం నుంచి ఊహించని విధంగా స్పందన ఉందని గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలు స్తోంది.

అయితే పార్టీలో ఉన్న గ్రూపులు, వర్గాల వల్లే పార్టీ ఎదుగుదలకు ప్రధాన ఆటంకమవుతున్నట్లు భావించిన ప్రధాని.. పార్టీ ఫస్ట్ అనే విషయంలో వేరే ఆలోచనలు ఉండవద్దని చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్రంలో పార్టీ నేతలు సరైన విధానం అనుసరించడం లేదని కూడా ప్రధానితో పాటు కేంద్ర పార్టీ భావిస్తోందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.

అందుకే సంస్థాగత ఎన్నికలు పూర్తయిన వెంటనే పార్టీని పరుగులు పెట్టించే కార్యాచరణ అధిష్ఠానం వద్ద ఉందని సమాచారం. డిసెంబర్ నెలాఖరు వరకు కొత్త అధ్యక్షున్ని నియమించి ఆయన ఆధ్వర్యంలో పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.